1.34 లక్షలు ... సర్ నోటీసులు అందుకున్న ఓటర్లు
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:45 AM
సర్.. కీలకదశకు చేరింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాక గతంలో ఓటర్లు జాబితాలో పేరుండి మ్యాపింగ్ కాని.. వివరాలు తప్పుగా ఉన్న, అనుమానాస్పదంగా ఉన్న ఓటర్లకు బీఎల్వోల ద్వారా నోటీసులు ఇస్తున్నారు.
54.71శాతం మంది విచారణ పూర్తి
సెప్టెంబరు 28తో ముగియనున్న ప్రక్రియ
విచారణకొచ్చింది 73,477
అర్హత పొందింది 64,674
అనర్హులు 579
గైర్హాజరైన వారు 19,848
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సర్.. కీలకదశకు చేరింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాక గతంలో ఓటర్లు జాబితాలో పేరుండి మ్యాపింగ్ కాని.. వివరాలు తప్పుగా ఉన్న, అనుమానాస్పదంగా ఉన్న ఓటర్లకు బీఎల్వోల ద్వారా నోటీసులు ఇస్తున్నారు. ఇలా జిల్లాలోని 1,34,307 మంది ఓటర్లకు వందశాతం నోటీసులు పంపిణీ చేశారు. గురువారం నాటికి 73,477 మంది (54.71శాతం) ఆయా అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నిర్ణీత రోజుకు విచారణకు 19,848 మంది గైర్హాజరయ్యారు. వీరికి మరో రెండుసార్లు నోటీసులు ఇస్తారు. నియోజకవర్గాలవారీగా.. అత్యధికంగా నగరి నియోజవర్గంలో 82.24 పూర్తికాగా అతి తక్కువగా కుప్పంలో 40.59 శాతమే జరిగింది. హియరింగ్‌లో తగిన ధ్రువపత్రాలు ఇచ్చి ఇప్పటివరకు 64,674 మంది (48.15 శాతం) తిరిగి ఓటర్లుగా అర్హత పొందారు. ఇందులో నియోజకవర్గాలవారీగా నగరిలో 69.44శాతం, గంగాధరనెల్లూరులో 67.13, పూతలపట్టులో 53.61, చిత్తూరు 42.96, పలమనేరు 42.08శాతం పొందగా, 34.63 శాతంతో కుప్పం చివరి స్థానంలో నిలిచింది. ఇక, గురువారంనాటికి విచారణలో తగిన వివరాలు ఇవ్వలేక 579 మంది ఓటుకు అనర్హులుగా తేలారు. వీరిలో అత్యధికంగా గంగాధరనెల్లూరు నియోజవర్గంలో 324 మంది, అత్యల్పంగా పూతలపట్టులో 26 మంది ఉన్నారు. ఆయా రోజుల్లో 5066 మందికి హియరింగ్ జరిగేలా నోటీసులు అందజేశారు. మరో 9210 మంది ఓటర్ల ఆధారాల వివరాలు పరిశీలన ప్రస్తుతం జరుగుతున్నది. నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన ఆధారాలను ఐదు రోజులలోపు పరిశీలించి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేస్తున్నారు.
విచారణకు హాజరైన ఓటర్లు
నగరి నియోజకవర్గంలో 12,391 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా ఇప్పటికి 10,190 మంది విచారణ పూర్తయిది. గంగాధరనెల్లూరులో 14,135 మందికి 10,779.. చిత్తూరులో 25,296కి 13,241.. పూతలపట్టులో 26,379కి 15,610.. పలమనేరులో 28,723కి 12,542.. కుప్పంలో 27,383 మంది ఓటర్లకుగాను 11,115 మంది విచారణకు హాజరయ్యారు. ఇలా మొత్తం 1,34,307 మంది ఓటర్లకుగాను 73,477 మంది విచారణ పూర్తయింది. వీరిలో సరైన ఆధారాలు చూపకపోవడంతో 579 మంది ఓటుకు అనర్హులుకాగా.. వివిధ ధ్రువపత్రాలు చూపి 64,674 మంది అర్హత పొందతారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు 28వ తేదీతో ముగియనుంది.
చొరవ చూపిస్తున్న పార్టీలు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు నిలుపుకోవాలన్న ఉత్సాహం నోటీసులు అందుకున్న ఓటర్లలో ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూర ప్రాంతాల్లో ఉంటున్న ఇలాంటి ఓటర్లను పిలిపించి ఆధారాలు అందజేసేలా చొరవ చూపిస్తున్నారు. తప్పులున్న ఓటర్లు ఎక్కువమందికి నోటీసులు జారీకావడంతో వాటిని ఆధార్, పాన్ ఇతర ధ్రువీకరణ పత్రాల ద్వారా సరిచేయించి ఓటు హక్కు కాపాడేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ ఫారం-6, 7, 8 ఇచ్చేందుకు
గడువు నాలుగు రోజులే
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఈనెల 31వ తేది వరకు గడువు ఇచ్చింది. అంటే నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలోగా స్పందించి ఇస్తే కొత్తగా ఓటు నమోదు.. మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. గత శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఆయా ఫారాలకు సంబంధించి 3764 దరఖాస్తులు అందాయి. ప్రత్యేక శిబిరాలకు మంచి స్పందన వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ శని, ఆదివారాల్లోనూ (29, 30 తేదీల్లో) రెండోసారి ప్రత్యేక శిబిరాలు జరగనున్నాయి అర్హత కలిగిన యువ ఓటర్లు తమ పేర్ల నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను ఫారం-7 ద్వారా అందించాలి. దీని ద్వారా ఓటు తొలగింపులు చేసుకోవచ్చు. ఇక, చిరునామా మార్పు, పేర్లలో దిద్దుబాటు, బ్లాక్ అండ్ వైట్ ఫొటో స్థానంలో కొత్తగా కలర్ ఫొటో.. ఇలా మార్పులు, చేర్పులకు ఫారం-8 అందించాలి. ఈ దరఖాస్తు ఫారాలను గడువులోగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో బీఎల్వోల వద్ద ఇవ్వాలి.
కలెక్టరేట్‌లో ‘స్థానిక’ ‘ఎలక్షన్ సెల్’
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, మున్సిపల్, మండల.. జిల్లా పరిషత్తులలో వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వి.పుల్లారెడ్డి నేతృత్వంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటైంది. ఇందులో డిప్యూటీ తహసీల్దార్ ఎస్.నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సుమీయ, జూనియర్ అసిస్టెంట్ పి.జగదీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎన్నికల విభాగం) డి.మనోజ్‌ను కేటాయించారు. స్థానిక ఎన్నికలు ముగిసేంతవరకు ఈ విభాగం కొనసాగనుంది.