Share News

తూముకుంట సోలార్‌ ప్రాజెక్టుకు 1,239 ఎకరాలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:41 AM

అన్నమయ్య జిల్లాలో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర కేబినేట్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ ప్రాజెక్టు కోసం లీజు ప్రాతిపదికన 1,239 ఎకరాలను కేటాయించింది. 500 మెగావాట్లు, 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులకు విడివిడిగా భూములను కేటాయించింది.

 తూముకుంట సోలార్‌ ప్రాజెక్టుకు 1,239 ఎకరాలు
తూముకుంట వద్ద పూర్తైన 500 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పనులు

రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

అన్నమయ్య జనవరి 28 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర కేబినేట్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ ప్రాజెక్టు కోసం లీజు ప్రాతిపదికన 1,239 ఎకరాలను కేటాయించింది. 500 మెగావాట్లు, 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులకు విడివిడిగా భూములను కేటాయించింది.

గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో 1187.58 ఎకరాలు కే టాయించింది. ఇందులో తూముకుంట గ్రామం సర్వేనంబరు 197, 200లలో 1100.03 ఎకరాలు, వెలిగల్లు గ్రామంలోని సర్వేనంబరు 432/2, 434/3లలో 87.55 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. 500 మెగా ఆల్ర్టా మెగా సోలార్‌పవర్‌ ప్రాజెక్టు కోసం లీజు మొత్తంపై 10ఽశాతం చెల్లింపుపై ఈ భూమిని కేటాయిస్తారు. తూముకుంట గ్రామంలో మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.2 లక్షలు, ఈ మేరకు ఎకరాకు సంవత్సరానికి రూ.20వేలు, వెలిగల్లు గ్రామంలో మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.2.50 లక్షలు..ఈ మేరకు ఎకరాకు సంవత్సరానికి రూ.25వేలు చొప్పున లీజు ధరను నిర్ణయించారు. ఐదేళ్లకొకసారి 10శాతం ఎస్కలేషన్‌తో 33 సంవత్సరాలు లీజు ఒప్పందం ఉంటుంది.

ఇదే గ్రామంలో 100 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం 52.09 ఎకరాలను కేటాయించారు. సర్వేనంబరు 977/1, 977/2లలో పైన పేర్కొన్న ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎకరాకు లీజు రేటు రూ.31వేలు సంవత్సరానికి చెల్లింపు ఒప్పందంపై ఈ భూమిని కేటాయిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి 5శాతం ఎస్కలేషన్‌తో 30 సంవత్సరాల కాలానికి ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీపాలసీ 2024 నిబంధనల ప్రకారం లీజు ఇచ్చారు.

కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాల కేటాయింపు

న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఽఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ స్కూల్‌ను సివిల్‌ సెక్టార్‌లో ఏర్పాటు చేయడానికి సాధారణ షరతులకు లోబడి మదనపల్లె మండలం వలసపల్లె గ్రామంలోని సర్వేనంబరు 496/2లో 6.09 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే స్థానిక రెవెన్యూ అధికారులు ఇందుకు స్థలం కేటాయించారు. గ్రామపంచాయతీ కూడా దీనికి మద్దతుగా తీర్మానం చేసింది.

Updated Date - Jan 29 , 2026 | 12:41 AM