Share News

జడ్పీటీసీలకు 122... ఎంపీటీసీలకు 977

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:26 AM

జిల్లావ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

జడ్పీటీసీలకు 122... ఎంపీటీసీలకు 977

తిరుపతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 35 జడ్పీ స్థానాలకు తొలి రోజు 51 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజైన గురువారం 122 నామినేషన్లు ఫైలయ్యాయి. అలాగే 444 ఎంపీటీసీ స్థానాలకు మొదటిరోజు 455 నామినేషన్లు రాగా రెండవ రోజు 977 నామినేషన్లు పడ్డాయి. జడ్పీటీసీ స్థానాలకు గురువారం దాఖలైన 122లో అత్యధికంగా టీడీపీ నుంచీ 63 నామినేషన్లు రాగా వైసీపీ నుంచీ 42, జనసేన నుంచీ 7, బీజేపీ నుంచీ 3, కాంగ్రెస్‌ నుంచీ 3, బీఎస్పీ నుంచీ 2, సీపీఐ, సీపీఎంల నుంచీ ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. చిట్వేలి, ఓబులవారిపల్లె, నాగలాపురం జడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా ఏడు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. వరదయ్యపాలెం, పాకాల, డక్కిలి జడ్పీటీసీ స్థానాలకు ఆరు చొప్పున నామినేషన్లు పడ్డాయి.చంద్రగిరి, పిచ్చాటూరు, ఎర్రావారిపాలెం జట్పీటీసీ స్థానాలకు ఐదు చొప్పున నామినేషన్లు వేశారు. వాకాడు, రేణిగుంట, రామచంద్రాపురం, ఓజిలి, నారాయణవనం, కోడూరు, కేవీబీపురం, చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీ స్థానాలకు నాలుగు చొప్పున, బీఎన్‌ కండ్రిగ, బాలాయపల్లె, పుత్తూరు, సత్యవేడు, తొట్టంబేడు స్థానాలకు మూడు వంతున, చిట్టమూరు, నాయుడుపేట, పెళ్ళకూరు, పెనగలూరు, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, తిరుపతి రూరల్‌, వడమాలపేట స్థానాలకు రెండు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఏర్పేడు, వెంకటగిరి, తడ, పుల్లంపేట, దొరవారిసత్రం స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. పార్టీల పరంగా చూస్తే టీడీపీ తరపున బీఎన్‌ కండ్రిగ, బాలాయపల్లె, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, చిట్వేలి, డక్కిలి, దొరవారిసత్రం, కేవీబీపురం, నాగలాపురం, నాయుడుపేట-2, నారాయణవనం, ఓబులవారిపల్లె, ఓజిలి, పాకాల, పెనగలూరు, పిచ్చాటూరు, పుత్తూరు, ఆర్సీపురం, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తడ, తొట్టంబేడు, తిరుపతి రూరల్‌,వెంకటగిరి,వాకాడు, వరదయ్యపాలెం,ఎర్రావారిపాలెం మండలాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరపున డక్కిలి, రేణిగుంట, ఎర్రావారిపాలెం మండలాల్లో నామినేషన్లు రాగా జనసేన తరపున చిన్నగొట్టిగల్లు, చిట్వేలి, రైల్వే కోడూరు, వరదయ్యపాలెం, ఎర్రావారిపాలెం మండలాల్లో నామినేషన్లు పడ్డాయి. రెండు రోజులూ కలిపి లెక్కిస్తే మొత్తం 173 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 444 ఎంపీటీసీ స్థానాలకు 977నామినేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా టీడీపీనుంచీ 467 నామినేషన్లు వచ్చాయి. కూటమి పార్టీల్లో టీడీపీ తర్వాత జనసేన నుంచీ 59 నామినేషన్లు రాగా బీజేపీ నుంచీ 20 నామినేషన్లు ఫైలయ్యాయి. వైసీపీ నుంచీ 349 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచీ 7, సీపీఎం నుంచీ 14, బీఎస్పీ నుంచీ 2, సీపీఐ నుంచీ 2, ఇతర పార్టీల నుంచీ 2 చొప్పున దాఖలు కాగా స్వతంత్ర అభ్యర్థుల నుంచీ 55 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులూ కలిపి చూస్తే 1432 నామినేషన్లు వచ్చాయి.

వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటే ఇన్నెలా దాఖలయ్యాయి?

జిల్లావ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో అయితే తమ అభ్యర్థుల మీద పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తున్నాయి. అయితే అదే సమయంలో జిల్లాలో ఆ పార్టీ తరపున జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల సంఖ్య చూస్తే ఆ పార్టీ వర్గాల ప్రచారంలో వాస్తవం ఎంతుందో తేలిగ్గా అర్ధమవుతుంది. మొదటి రోజు జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ నుంచీ 12 నామినేషన్లు దాఖలు కాగా వైసీపీ నుంచీ 28 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో రోజు టీడీపీ నుంచీ 63 నామినేషన్లు రాగా వైసీపీ నుంచీ 42 నామినేషన్లు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే తొలిరోజు టీడీపీ తరపున 316 నామినేషన్లు ఫైల్‌ కాగా వైసీపీ తరపున 74 నామినేషన్లు ఫైలయ్యాయి. రెండవ రోజు టీడీపీ తరపున 467 నామినేషన్లు దాఖలైతే వైసీపీ తరపున 349 నామినేషన్లు దాఖలయ్యాయి. కూటమి పార్టీల వర్గాలు నిజంగా అడ్డుకుని వుంటే ఇంత సంఖ్యలో వైసీపీ అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

Updated Date - Oct 23 , 2026 | 12:26 AM