జడ్పీటీసీలకు 12.. ఎంపీటీసీలకు 297..
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:51 AM
పరిషత్’ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. తొలి రోజు సోమవారం 12 మంది జడ్పీటీసీ అభ్యర్థులు, 297 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండటంతో మరికొంతమంది విత్‌డ్రా చేసుకునే అవకాశముంది.
నేటితో ముగియనున్న గడువు
చిత్తూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘పరిషత్’ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. తొలి రోజు సోమవారం 12 మంది జడ్పీటీసీ అభ్యర్థులు, 297 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండటంతో మరికొంతమంది విత్‌డ్రా చేసుకునే అవకాశముంది.
ఎంపీటీసీ అభ్యర్థులు 1491 మంది
జిల్లాలో మొత్తం 370 ఎంపీటీసీ స్థానాలుండగా, పరిశీలన అనంతరం మొత్తం 1788 నామినేషన్లను ఆమోదించారు. వీరిలో సోమవారం 297 మంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోగా 1491 మంది జాబితాలో ఉన్నారు. విత్‌డ్రా చేసుకున్నవారిలో టీడీపీ నుంచి 147 మంది, వైసీపీ నుంచి 126, జనసేన నుంచి 8, కాంగ్రెస్ 2, బీజేపీ 2, స్వతంత్రులు 12 మంది ఉన్నారు.
జడ్పీటీసీ అభ్యర్థులు 162 మంది
జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు 181 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో ఏడింటిని తిరస్కరించగా.. సోమవారం 12 మంది విత్‌డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం 162 నామినేషన్లు జాబితాలో ఉన్నాయి. కుప్పం, గంగవరం, పెద్దపంజాణి మండలాల నుంచి ఇద్దరు చొప్పున, పులిచెర్ల, పూతలపట్టు, బంగారుపాళ్యం, వి.కోట, శాంతిపురం మండలాల నుంచి ఒక్కోటి చొప్పున నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. పార్టీల వారీగా చూసుకుంటే వైసీపీ 7, టీడీపీ 3, జనసేన 1, స్వతంత్రులు 1 చొప్పున విత్‌డ్రా చేసుకున్నారు.
బంగారుపాళ్యంలో లైన్ క్లియర్
బంగారుపాళ్యం జడ్పీటీసీగా బరిలో ఉన్న జనసేన అభ్యర్థి బుస్సా రమణమ్మ సోమవారం తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్‌పీ సుచిత్ర జయప్రకాష్, ఎన్‌పీ ఇందిర ధరణీ ప్రసాద్ నామినేషన్లు మాత్రమే మిగిలాయి. వీరిద్దరూ టీడీపీ అభ్యర్థులే కావడంతో మంగళవారం ఇందిర విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. దీంతో సుచిత్రకు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఇక పూతలపట్టులో స్వతంత్ర అభ్యర్థి నరసింహులు నాయుడు సోమవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీఎస్పీ నుంచి పద్మ, జనసేన నుంచి అభినవ్ విష్ణు మాత్రమే మిగిలి ఉన్నారు. యాదమరిలో టీడీపీ అభ్యర్థి యశోద నామినేషన్ ఒక్కటే ఉండటంతో.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మంగళవారం అధికారులు ధ్రువపత్రం అందించే అవకాశముంది.
రేపటి నుంచి జోరందుకోనున్న ప్రచారం
‘పరిషత్’ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. తర్వాత ఏకగ్రీవ స్థానాలపై స్పష్టత వస్తుంది. ఏకగ్రీవమైన స్థానాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు బుధవారం నుంచి ప్రచారం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో నవంబరు 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండగా, ఆ తేదీలను రెండు రోజుల తర్వాతకు మార్చనున్నారు.