త్వరలో 103 బస్సు సర్వీసులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:48 AM
ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీవో) ఎం.శశిభూషణ్ చెప్పారు. పీలేరు ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 103 కొత్త బస్సులు రానున్నాయన్నారు.
పీలేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీవో) ఎం.శశిభూషణ్ చెప్పారు. పీలేరు ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 103 కొత్త బస్సులు రానున్నాయన్నారు. వీటిలో రాయచోటి డిపోకు 53, మదనపల్లె డిపోకు 50 బస్సులు రానున్నాయని తెలిపారు. పీలేరు డిపోకు రెండో విడతలో కేటాయిస్తామన్నారు. వచ్చే మార్చి నాటికి 15 ఏళ్ల కాలపరిమితి పూర్తవుతున్న 83 బస్సులను పక్కన పెట్టాల్సి వస్తుందన్నారు. ఈక్రమంలో పీలేరు డిపో 28 బస్సులు కోల్పోతుందన్నారు. రోడ్డు ప్రమాదాలను 0.05 శాతానికి పరిమితం చేశామన్నారు. జిల్లాలో స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన లభిస్తోందని, గతనెల వరకు జిల్లాలో 4.15 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు. అందుకుగాను ప్రభుత్వం నుంచి రూ.161 కోట్ల నిధులు సంస్థకు అందాయని తెలిపారు. స్త్రీశక్తి పథకం అమలులో పీలేరు డిపో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. పీలేరు డిపో పరిధిలో ఈ పథకం ద్వారా 1.30 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా రూ.38.32 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పీలేరు డిపో మేనేజర్ రోషన్, ఎంఎఫ్ ఫణిభూషణ్ నాయక్, పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు.