ఉద్యోగం పేరుతో రూ.10 లక్షల స్వాహా
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:27 AM
రూ.45 లక్షల చెక్కులు తీసుకున్న నకిలీ సీబీఐ అధికారి
పుంగనూరు రూరల్, మార్చి27(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం ఇప్పిస్తామంటూ నకిలీ సీబీఐ అధికారి, మరో మహిళ కలిసి పుంగనూరులో ఓ మహిళను నమ్మించి రూ.10 లక్షలు స్వాహా చేశారు. మరో రూ.45 లక్షలకు చెక్కులు తీసుకుని మోసం చేశారు. దీనిపై పుంగనూరు సీఐ సుబ్బరాయుడు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ, బాధితురాలు లావణ్య వివరాల మేరకు.. పుంగనూరు మండలం వనమలదిన్నెకు చెందిన లావణ్య (31)గంగవరం మండలం గడ్రాజపల్లె సమీపంలో గార్మెంట్స్(కుట్టుమిషన్ కేంద్రం)లో నెలకు రూ.10 వేలు వేతనంతో పనిచేస్తోంది. అనారోగ్యం కారణంగా 2024 అక్టోబర్‌లో లావణ్య పుంగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందే సమయంలో పుంగనూరు ఆర్టీసీ డిపో సమీపంలో కాపురముండే అశోక్ భార్య హేమప్రదతో పరిచయం ఏర్పడింది. తన భర్త అశోక్ అలియాస్ వినయ్‌కుమార్ కర్ణాటకలో సీబీఐ అధికారిగా పనిచేస్తున్నారని, ఆయనతో మాట్లాడి ఉద్యోగం తీసిస్తానని, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తామని చెప్పింది. ఆధార్, ఓటరు, పాన్‌కార్డులు తీసుకున్నారు. తన భర్తకు బ్యాంకు రూ.3కోట్లు లోన్ మంజూరు చేసిందని, దానికోసం కొంత డిపాజిట్ కట్టాల్సి ఉందని చెప్పి రూ.10లక్షల వరకు నగదు, మరో 45లక్షలకు బ్యాంకు చెక్కులు తీసుకుని మోసం చేసింది. లావణ్య భర్త రమేష్ పలుమార్లు బెంగళూరుకు తిరిగినా వాయిదాలు వేస్తూ కాలం గడిపారు. తర్వాత హేమప్రద ఫోన్ తీయకపోగా రూ.45 లక్షలు బాకీ ఉన్నట్లు కోర్టు నుంచి లీగల్ నోటీసులు పంపడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.