జూన్‌కల్లా 100 శాతం చెత్త క్లియర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:08 AM
రాష్ట్రంలో జూన్ కల్లా వందశాతం చెత్త క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
డంపింగ్ యార్డులన్నీ పార్కులుగా మార్పు
నూరుశాతం ఇంటింటి చెత్తసేకరణ, ప్రాసెసింగ్
స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ఠ కార్యాచరణ
స్వర్ణాంధ్ర సమీక్షలో చంద్రబాబు స్పష్టీకరణ
ర్యాంకుల్లో విశాఖ ఫస్ట్, అల్లూరి జిల్లా లాస్ట్
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జూన్ కల్లా వందశాతం చెత్త క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో అవసరమైనచోట కొత్తగా పబ్లిక్ టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్ణీత పరిధిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు నెలకొల్పేలా చూడాలని కోరారు. గతంలో వ్యర్థాలతో నిండిపోయిన డంపింగ్ యార్డుల నుంచి ప్రస్తుతం చెత్త క్లియర్ చేయడంతోపాటు ఆయా స్థలాలను పచ్చదనంతో నింపేలా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణానికి సమీపంలో ఉన్న డంపింగ్ కేంద్రాలను పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు. వైసీపీ దిగిపోయేనాటికి పట్టణాల్లో 153 లక్షల టన్నుల చెత్త పేరుకుపోగా, 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 114లక్షల టన్నుల చెత్త తొలగించినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పేరుకుపోయిన 10 లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, కంపోస్ట్ మార్కెటింగ్ చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. మ్యాజిక్ డ్రెయిన్లకు అనుసంధానంగా కమ్యూనిటీ సోక్‌పిట్స్ తీసుకురావడం ద్వారా మురుగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ తడిచెత్త, పొడిచెత్త నిర్వహణ, సోలార్‌రూప్ టాప్ ఏర్పాటు, నెట్ జీరో, గ్రీనరీ పెంపు, క్లీన్ హైజిన్ కిచెన్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడిచెత్త సేకరిస్తున్నామని, గోబర్‌ధన్ యూనిట్లు, గ్రీన్‌షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నామని అధికారులు తెలిపారు. డిసెంబర్ కల్లా గోబర్‌ధన్ ప్లాంట్లు సిద్దం అవుతాయని వెల్లడించారు.
థర్డ్ పార్టీతో ర్యాంకుల నిర్ణయం
2026 మార్చి 31 వరకు రూపొందించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకుల జాబితాను సీఎంకు అధికారులు అందించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో ఉండగా, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా 92శాతం, విజయనగరం, గుంటూరు జిల్లాలకు 85శాతం మార్కులు వచ్చాయి. అట్టడుగున ఉన్న అల్లూరి జిల్లాకు 53శాతం మార్కులు వచ్చాయి. డోర్ టు డోర్ కలెక్షన్, తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఓడీఎఫ్ ప్లస్ మోడల్ వంటివాటిని ర్యాంకులకు ప్రాతిపదికగా తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై జిల్లాలకు స్వచ్ఛాంధ్ర ర్యాంకులు థర్డ్ పార్టీ ఇచ్చేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు.
590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు...
10 జిల్లాల్లో 590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పట్టణాల్లో 2024-26 మధ్య 57 గ్రీన్ స్పేస్ పార్కులు అభివృద్ధి చేశామని, మరో 284 గ్రీన్ స్పేస్ పార్కులు, 100 స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అధికారులు తెలపగా, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. డిసెంబర్ కల్లా 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, లక్ష సోక్ పిట్స్, 8 వేల కమ్యూనిటీ సోక్‌పిట్స్, 100కి.మీ.మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం జరగాలని నిర్దేశించారు. సెప్టెంబర్ కల్లా అన్నీ గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా నిలపాలని సూచించారు. 31.33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంత్రి నారాయణ, పీసీడీ చైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కృష్ణతేజ, సీడీఎంఏ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.