Share News

అండమాన్‌కు సముద్రగర్భ కేబుల్‌ నెట్‌వర్క్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:23 AM

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో డిజిటల్‌ కనెక్టివిటీని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

అండమాన్‌కు సముద్రగర్భ కేబుల్‌ నెట్‌వర్క్‌
andamon

  • దీవులను అనుసంధానించేలా ఏర్పాటు

  • 87 గ్రామాలకు 4జీ సేవల విస్తరణ

  • డిజిటల్‌ కనెక్టివిటీ బలోపేతానికి కేంద్రం చర్యలు

శ్రీవిజయపురం, నవంబరు 22: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో డిజిటల్‌ కనెక్టివిటీని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎనిమిది దీవులను అనుసంధానించేలా సముద్ర గర్భ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు, మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని 87 గ్రామాలకు 4జీ సేవల విస్తరణ సహా పలు చర్యలను పరిశీలిస్తోంది. దీవుల్లోని మారుమూల, భౌగోళికంగా విడిగా ఉన్న ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ సేవలు, అత్యవసర కమ్యూనికేషన్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ప్రతిపాదిత కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల కేంద్ర టెలీకమ్యూనికేషన్‌ విభాగం కార్యదర్శి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దినేశ్‌ శర్మ మధ్య జరిగిన సమావేశంలో ఆయా ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పీఏఎన్‌ఐ (పోర్టు ఆల్టర్నేటివ్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఐలాండ్స్‌) ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఈ ప్రణాళిక కింద డిగ్లీపూర్‌, మాయాబందర్‌, షహీద్‌ ద్వీప్‌, చౌరా, టెరెస్సా, కచ్చల్‌, నాన్‌కౌరీ, లిటిల్‌ నికోబార్‌లను సముద్ర గర్భ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు మారుమూల ద్వీపాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్యను పరిష్కరిస్తుందని, అత్యవసర సమయాల్లో మెరుగైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందిస్తుందని భావిస్తున్నారు. ప్రతిపాదిత నెట్‌వర్క్‌ ఒడిశాలోని పురీ నుంచి ప్రారంభవుతుంది. ఇది ప్రస్తుతమున్న చెన్నై-అండమాన్‌ నికోబార్‌ సముద్ర గర్భ కేబుల్‌ నెట్‌వర్క్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించనుంది. ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ దెబ్బతిన్నా లేదా అంతరాయం కలిగినా అలాంటి సందర్భాల్లో ఇంటర్నెట్‌ సేవలకు ఆటంకం కలగకుండా ఉండడంతో సహకరించనుంది

Updated Date - Nov 23 , 2026 | 06:41 AM