కళ్ల ముందే జల ప్రళయం!
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:22 AM
‘మానస సరోవర్ యాత్ర కోసం భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు కుటుంబం నుంచి 8 మంది ఈ నెల 21 రాత్రి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఖాట్మండు బయలుదేరాం.
‘ఆంధ్రజ్యోతి’తో భీమిలికి చెందిన తాతినాయుడు
‘మానస సరోవర్ యాత్ర కోసం భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు కుటుంబం నుంచి 8 మంది ఈ నెల 21 రాత్రి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఖాట్మండు బయలుదేరాం. 22న ఖాట్మండు చేరుకున్నాం. 23న మానస సరోవర యాత్రకు చైనా నుంచి వీసా రావాలి. అయితే 20 ఏళ్ల తర్వాత మానస సరోవర్‌లో భారీగా బౌద్ధ ఉత్సవాలు నిర్వహించడం, రానున్న పౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో యాత్రికులు ఉండడంతో చైనా పరిమితంగా వీసాలు జారీచేసింది. మాకు 25వ తేదీ సాయంత్రం వీసా దొరికింది. 26న ఉదయం 6.15 గంటలకు 24మందితో మా బస్సు బయలుదేరింది. ఖాట్మండు నుంచి మానస సరోవర ప్రాంతం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము నాలుగు గంటలపాటు ప్రయాణించిన తర్వాత కొంతమంది కాలకృత్యాలు తీర్చుకుంటామని డ్రైవర్‌కు చెప్పడంతో బస్సు ఆపారు. పావుగంట తర్వాత బస్సు తిరిగి బయలుదేరింది. మరో 50 మీటర్లు ప్రయాణిస్తే... నదిపై ఉన్న వంతెనపైకి బస్సు చేరుకునేది. అంతలోనే జల ప్రళయం మొదలైంది. మా ముందున్న మినీ వ్యాన్ డ్రైవర్ వెనక్కి వచ్చేస్తూ.. మమ్మల్ని హెచ్చరించారు. వెంటనే మా డ్రైవర్ సమయస్ఫూర్తితో క్షణాల్లో బస్సును వెనక్కి తిప్పి, ఎదురుగా ఉన్న కొండపైకి తీసుకువెళ్లాడు. బస్సు తిప్పుతున్న సమయంలోనే వరద మా బస్సుకు అతి సమీపంలోకి వచ్చింది. స్థానిక అధికారులు సైరన్ మోగించడంతో ప్రజలు పరుగులు పెడుతూ కొండపైకి చేరుకున్నారు. పాఠశాలల పిల్లలు కొందరు మా కళ్లముందే కొట్టుకుపోయారు. నేపాల్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో మేమంతా తిరిగి ఖాట్మండు చేరుకున్నాం. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లి, అక్కడ నుంచి భోగాపురం వస్తాం. మంత్రి లోకేశ్ మాతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.’’
- తాతినాయుడు, భీమిలి, విశాఖపట్నం జిల్లా