Share News

బాహుదా ఉగ్రరూపం

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:00 AM

తుఫాన్‌ ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీ స్‌గఢ్‌ దిశగా పయనించే సమయంలో కుంభవృష్టి కురిసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి.

బాహుదా ఉగ్రరూపం

ఎన్‌హెచ్‌పై నాలుగు అడుగుల ఎత్తున నీరు

జలదిగ్బంధంలో 15 గ్రామాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తుఫాన్‌ ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీ స్‌గఢ్‌ దిశగా పయనించే సమయంలో కుంభవృష్టి కురిసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. ఒడిశాలో అనేకచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఒడిశా నుంచి వరద పొరుగునున్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైపు వస్తోంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బాహుదానది ఉగ్రరూపం దాల్చింది.

ఓ వైపు జిల్లాలో కురిసిన వర్షాలతోపాటు.. ఒడిశాలోని భగలట్టి డ్యామ్‌ వద్ద గేట్లు ఎత్తివేయడంతో.. నదికి భారీగా వరదనీరు పోటెత్తింది. గురువారం ఉదయం ప్రమాదకరస్థితిలో 84,568 క్యూసెక్కులు ప్రవహించింది. ఇచ్ఛాపురంలో నది గట్లను దాటుకొని.. రైల్వేవంతెనను తాకుతూ నీరు ప్రవహించింది. ఆ ప్రాంతంలో జాతీయరహదారిపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. జాడుపూడి వద్ద రైలుపట్టాలపై నీరు ప్రవహిస్తుండడం ఆందోళన కలిగించింది.


బాహుదా పరిధిలో ఉన్న 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్డుపైకి నీరు చేరటంతో రత్తకన్న, మశాఖపురం, బీ.తోటూరు, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కీర్తిపురం గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతితో చంపావతి, నాగావళి, సువర్ణముఖి, వేదావతి నదులు ఉప్పొంగడంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ వద్ద రహదారి కొట్టుకుపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పాలకొండ ప్రాంతాల్లో కొండవాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

70 శాతం దిగుబడి తగ్గింది..

‘‘మరో 15 రోజుల్లో పంట కోయాలనుకున్నాం. ఎకరానికి 40 బస్తాలయ్యేలా పంట పండింది. తుఫాను బీభత్సంతో మొత్తం పంట నేలపాలైంది. పది ఎకరాల సాగు మోకాలి లోతు నీటిలో ఉంది. నీరు కాలువల్లోకి వెళ్లడం లేదు. గింజలు రంగు మారతున్నాయి. మొలకలు వస్తున్నాయి. 70 శాతం దిగుబడి తగ్గిపోతుంది.’’

- ఎన్‌.కృష్ణ, రైతు, గునుపూడి, భీమవరం,

పశ్చిమ గోదావరి జిల్లా

Updated Date - Oct 30 , 2026 | 06:00 AM