అవేర్‌ని ఉపయోగించుకోండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:20 AM
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసై టీ(ఆర్టీజీఎస్)లోని అవేర్ యాప్, వెబ్‌సైట్‌ను జిల్లాల్లోని ప్రతి ఒక్క అధికారి ఉపయోగించుకునేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అప్పుడే సత్ఫలితాలు సాధించగలుగుతారు: కాటంనేని భాస్కర్
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రియల్ టైమ్ గవర్నెన్స్ సొసై టీ(ఆర్టీజీఎస్)లోని అవేర్ యాప్, వెబ్‌సైట్‌ను జిల్లాల్లోని ప్రతి ఒక్క అధికారి ఉపయోగించుకునేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీవ్రత తదితర రియల్ టైమ్ అంచనాలన్నీ అవేర్ ద్వారా అందిస్తున్నామని, అయితే జిల్లాల్లో దీన్ని చాలా తక్కువగా ఉపయో గిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అందరూ అవేర్ యాప్‌ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే జెన్‌కో అవేర్ అందించే హీట్ మ్యాప్ విద్యుత్ డిమాండును అంచనా వేస్తోందన్నారు. పురపాలక, అగ్నిమాపక శాఖలు అవేర్‌ను బాగా ఉపయోగిస్తున్నాయని చెప్పారు.
‘మనమిత్ర’ను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలు మనమిత్ర యాప్‌ను మరింతగా ఉపయోగించుకునేలా కలెక్టర్లు దృష్టి సారించాలని భాస్కర్ చెప్పారు. ‘రెవెన్యూ శాఖకు సంబంధించి ఈ వారం నుంచి 4 రకాల సేవలను పొందుపరిచాం. కుల తదితర నాలుగు రకాల రీ ఇష్యూయెన్స్ సర్టిఫికెట్లను పౌరులు నేరుగా వాట్సాప్ నుంచే డౌన్లోడు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం’ అన్నారు.
డేటా లేక్‌లో సమగ్ర సమాచారం
డేటా లేక్ ద్వారా జిల్లా కలెక్టర్లకు సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చిందని భాస్కర్ తెలిపారు. అధికారుల వద్దకు వచ్చే పౌరులను ఫలానా వివరాలు కావాలని అడగక్కర్లేదని, ఆ సమాచారం డేటాలేక్ ద్వారా అందించే డేటా సెట్స్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. దీన్ని సద్వినియోగించు కుంటే పాలన మరింత సరళతరం, సులభతరం అవుతుందన్నారు.
అంతటా ఈ-ఫైళ్లే ఉండాలి
అన్ని ఫైళ్లు.. ఈ-ఫైళ్ల రూపంలో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని భాస్కర్ తెలిపారు. ఇప్పటికీ జిల్లాల్లో కొంతమంది అధికారులు ఫైళ్లను ఫిజికల్ రూపంలోనే నిర్వహిస్తున్నారని, నెల రోజుల్లో అన్ని కార్యాలయా ల్లోనూ ఈ-ఫైళ్లే నిర్వహించాలన్నారు. ఈ ఆఫీసు నిర్వహణను కలెక్టర్లు పర్యవేక్షిస్తూ.. అంతటా ఈ ఫైళ్లే నడిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.