ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 07:38 AM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి యంత్రాంగం నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి, అక్టోబర్ 28: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి యంత్రాంగం నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ.. ఎక్కడైనా ప్రాణనష్టం సంభవించిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు సీఎంకు నివేదించారు. వర్షాలు కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈదురు గాలులు వీస్తున్నాయని కలెక్టర్లు తెలిపారు. తుఫాన్ కారణంగా ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని చిన్న నీటిపారుదల చెరువుల పరిస్థితిని సీఎం సమీక్షించారు. చెరువులు పొంగిపొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సాగునీటి సంఘాలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. చెరువుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాలను నిరంతరం గమనిస్తూ.. పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. చెట్లు కూలిన ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారిని పరిస్థితులు పూర్తిగా కుదుటపడిన తర్వాతే ఇళ్లకు పంపాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పంట నష్టంపై సీఎం చంద్రబాబు ఆరా..
ఆర్నబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 5 వేల హెక్టార్లలో అరటి పంట, 8 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ధ్వంసమైనట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను కేంద్రానికి వివరించడంతో పాటు, పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని సూచించారు. తుఫాన్ సమయంలో రాత్రంతా కష్టపడి పనిచేసిన అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు అభినందించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్