గ్రూప్-1 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:18 AM
అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 89 పోస్టులకు గాను 87 మందితో ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది.
87 మందితో జాబితా ప్రకటించిన ఏపీపీఎస్సీ
న్యాయ వివాదాలతో 2 క్రీడా పోస్టులు పెండింగ్
కోర్టు తీర్పుల అనంతరం మార్పులు ఉండొచ్చని వెల్లడి
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 89 పోస్టులకు గాను 87 మందితో ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. న్యాయ వివాదాల కారణంగా రెండు క్రీడా కోటా పోస్టులను పెండింగ్‌లో పెట్టింది. సీటీవో, డీఎస్పీ సివిల్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. వివిధ కేటగిరీల్లో పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 2023 డిసెంబరులో 81 పోస్టులతో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతరం 8 క్యారీ ఫార్వార్డ్ పోస్టులు కలిపారు. 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్ జరిగాయి. జూన్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు 185 మంది ఎంపికయ్యారు. వారిలో నలుగురు క్రీడా కోటా అభ్యర్థులున్నారు. మొత్తం పోస్టుల్లో 2 క్రీడా కోటా పోస్టులున్నాయి. ఇప్పుడు క్రీడా కోటా మినహా 87 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో బీసీ-ఈ కేటగిరీ అభ్యర్థుల ఎంపిక న్యాయస్థానంలో ఉన్న ఓ కేసులో తుది తీర్పునకు అనుగుణంగా ఉంటుందనే షరతుతో జరిగిందని ఏపీపీఎస్సీ తెలిపింది. అలాగే మిగిలిన అభ్యర్థుల ఎంపికలోనూ క్రీడా, ఇతర కేసుల తుది తీర్పు అనంతరం మార్పులు జరగొచ్చని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల గ్రూప్-2కు ఎంపికైన పలువురు ఇప్పుడు గ్రూప్-1లోనూ ఉద్యోగాలు సాధించారు. తెలంగాణ గ్రూప్-1లో డీఎస్పీ ఉద్యో ం దక్కించుకున్న సుదర్శన్ ఏపీ గ్రూప్-1లోనూ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఇటీవల గ్రూప్-2లో సబ్ రిజిస్ర్టార్ ఉదోగ్యం సాధించిన అశోక్ రెడ్డి ఇప్పుడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. గుడివా డ మున్సిపల్ పాఠశాలలో గణితం టీచర్‌గా పనిచేస్తున్న బి.నాగేంద్ర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఉద్యోగం సాధించారు.
కేటగిరీల వారీగా పోస్టుల భర్తీ...
డిప్యూటీ కలెక్టర్- 9, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్- 17, డీఎస్పీ- 25, డీఎస్పీ(జైళ్లు)- 1, డివిజనల్/డిస్ర్టిక్ ఫైర్ ఆఫీసర్- 2, రీజనల్ ఆర్టీవో- 6, జిల్లా బీసీ సంక్షేమ అధికారి-1, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్- 3, కోఆపరేటివ్స్ డిప్యూటీ రిజిస్ర్టార్- 6, గ్రేడ్-2 మున్సిపల్ కమిషర్- 3, ఏఈఎస్- 1, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్- 3, జిల్లా ఉపాధి కల్పన అధికారి-4, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2, ఎంపీడీవో- 4 పోస్టులు భర్తీ అయ్యాయి.
విజయం సాధించారిలా..
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భూపతి నరసింహారావు రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో ఈ విజయం సాధించానని, ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కోదాటి సూర్యప్రకాశ్ డీఎస్పీగా ఎంపిక య్యారు. జేఎన్టీయూ విజయనగరంలోబీటెక్ పూర్తిచేశానని, ప్రస్తుతం విజయవాడలోని శరత్‌చంద్ర అకాడమీలో మెంటార్‌గా పనిచేస్తూ రోజుకు 7గంటల పాటు చదివి విజయం సాధించానని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం గ్రామానికి చెందిన సంపతిరావు శివ నాగగౌరి డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈమె ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్నారు. ఈమె భర్త చౌదరి అవినాష్ శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‌గా ఉన్నారు. శివ నాగగౌరి రెండో ప్రయత్నంలో విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామానికి చెందిన పైల సుందరరావు డీఎస్పీగా ఎంపికయ్యారు. 2022 సీజేఎల్ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన ఆయన ప్రస్తుతం విజయవాడలో గణంకాల శాఖలో అసిస్టెంట్ అడిట్ అధికారిగా పనిచేస్తున్నారు. సివిల్స్‌లో ప్రతిభ కనపరచడమే తన లక్ష్యమని సుందరరావు తెలిపారు. తండ్రి పైల రాజరావు రైతు. తల్లి లక్ష్మి గృహిణి.
ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలేనికి చెందిన పెండ్యాల వెంకట నవీన డీఎస్పీగా ఎంపికయ్యారు. గ్రూపు-1 మొదటి ప్రయత్నంలోనే ఆమె అర్హత సాధించారు. రెండో ప్రయత్నంలో డీఎస్సీగా ఎంపికయ్యారు. తల్లి మాధవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి పెండ్యాల రామకోటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు యూనిట్ టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన శృతి బేతాళ జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారిగా ఎంపికయ్యారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతూ రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో అకౌంట్స్ కమ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి బి.రమ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తండ్రి శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన అంగజాల వైష్ణవి ఏసీటీవోగా ఎంపికయ్యారు.. ప్రస్తుతం ఆమె దేవదాయ శాఖలో షేర్‌మహ్మద్‌పేట గ్రూప్ టెంపుల్స్‌కు గ్రేడ్1 ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె తండ్రి రవీంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
గోరంట్ల పట్టణానికి చెందిన దేవాంగం జీవన జ్యోతి ఏసీటీవో ఉద్యోగం సాధించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసిన ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.
తిరుపతికి చెందిన చాందిని డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ టీటీడీ డిప్యూటీగా పనిచేస్తున్నారు.

ఆర్‌టీవోగా కార్పెంటర్ కుమారుడు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వరవకట్ట ప్రాంతానికి చెందిన షేక్ ఇసుబ్ సలాం ఏపీ రవాణా శాఖలో ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్‌టీవో)గా ఎంపికయ్యారు. సలాం తండ్రి షేక్ సుభానీ వృత్తిరీత్యా కార్పెంటర్ కాగా, తల్లి గృహిణి.

కానిస్టేబుల్ కుమార్తెకు డీఎస్పీ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గురుజు లక్ష్మీ అంజన డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి దివాకర్ భీమవరంలోని పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రైటర్ కాగా తల్లి హేమలత ప్రైవేటు పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. అంజన డీఎస్పీ పోస్టు దక్కించుకోవడంపై వారి కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







