2027 నాటికి పోలవరం పూర్తే లక్ష్యం
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:04 AM
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసి ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
రెండో దశకు కేంద్రాన్ని 42,500 కోట్లు కోరాం: నిమ్మల
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసి ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సీఎం చేస్తున్న కృషిని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అభినందించినట్లు చెప్పారు. పాటిల్‌తో చంద్రబాబు భేటీ వివరాలను నిమ్మల ఏపీభవన్‌లో మీడియాకు వెల్లడించారు. పోలవరం నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని బనకచర్ల మీదుగా త్వరితగతిన చేపట్టాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ అనుసంధానంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది గోదావరి నుంచి భారీగా వరద నీరు సముద్రంలోకి వెళ్లిందని చెప్పారు. ఒక్కరోజులోనే సుమారు 122 టీఎంసీల నీరు కడలిపాలైందని.. ఈ వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా పోలవరం-కావేరి అనుసంధానం చేపడితే భారీ గా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పామని వివరించారు.
2019 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆర్‌సీఈ ఆమోదం పొందిందన్నారు. ప్రస్తుతం 41.15 మీటర్ల కాంటూరు వరకు తొలిదశలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు 45.72 మీటర్ల కాంటూరు వరకు నిల్వచేసి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. మిగిలిన భూసేకరణ, పునరావాసం తదితర అవసరాల కోసం సుమారు రూ.42,500 కోట్ల వరకు అవసరమవుతుందని, ఈ మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. పోలవరం స్పిల్‌వే వద్ద వ్యూ గ్యాలరీలు, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. భద్రాచలం నుంచి రాజమండ్రి, కాకినాడ వరకు జాతీయ జలమార్గాన్ని మరింత అభివృద్థి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. 2009లో క్లాస్-3గా నోటిఫై చేసిన ఈ జలమార్గాన్ని కొనసాగిస్తూ విస్తరించాలని విజ్ఞప్తి చేశామని నిమ్మల పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు