థర్మల్ కేంద్రాల్లో రికార్డు ఉత్పత్తి
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:49 AM
రాష్ట్ర ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి అర్ధభాగంలో (ఏప్రిల్- సెప్టెంబరు) రికార్డు స్థాయిలో 19,268 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.
తొలి ఆరు నెలల్లో 13.1 శాతం వృద్ధి
గణనీయంగా పెరిగిన కేంద్రాల సామర్థ్యం
ఎల్‌నినో ఇబ్బందులున్నా నిరంతర సరఫరా
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి అర్ధభాగంలో (ఏప్రిల్- సెప్టెంబరు) రికార్డు స్థాయిలో 19,268 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 17,037 ఎంయూలు ఉత్పత్తి అయిందని చెప్పారు. దానితో పోలిస్తే ఈ ఏడాది 13.1 శాతం అధికంగా ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రాష్ట్ర విద్యుత్తు సరఫరా పరిస్థితిపై శుక్రవారం విద్యుత్తు సౌధలో సమీక్ష సమావేశం అనంతరం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో రానున్న నెలల్లో రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన ఇంధన భద్రత వ్యవస్థను, సమగ్ర ముందస్తు విద్యుత్తు కొనుగోలు ప్రణాళికను రూపొందించామని వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు థర్మల్ విద్యుత్తు కేంద్రాలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేశామని, వీటి సగటు లభ్యత గతేడాది 66 శాతం ఉండగా ఈ ఏడాది 79 శాతానికి పెరిగిందని చెప్పారు. అలాగే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 59.7 శాతం నుంచి 66.4 శాతానికి పెరిగిందని తెలిపారు. ఎన్టీటీపీఎస్ యూనిట్-7 వరుసగా 146 రోజులు, యూనిట్-8 వరుసగా 101 రోజులు ట్రిప్ కాకుండా నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి చేశాయని తెలిపారు. ఎల్‌నినో ఇబ్బందులను అధిగమించి నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నామని విజయానంద్ స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి లింకేజీ కింద రావాల్సిన బొగ్గు సరఫరా ఈ ఏడాది ఏప్రిల్- ఆగస్టు మధ్య బాగా తగ్గిందని తెలిపారు. కేటాయించిన పరిమాణంలో.. ఎన్టీటీపీఎస్‌కు 35 శాతం, ఆర్టీపీపీకి 14శాతం మాత్రమే సరఫరా అయిందన్నారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. సింగరేణి లింకేజీలను మహానది కోల్‌ఫీల్డ్ లిమిటెడ్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు బదిలీ చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖను కోరామని వెల్లడించారు.
ముందస్తు విద్యుత్తు కొనుగోలు ప్రణాళిక
ఎల్‌నినో అంచనాల ఆధారంగా నెలవారీ విద్యుత్తు కొనుగోలు ప్రణాళికను రూపొందించామని విజయానంద్ తెలిపారు. ఇందులో 700 మెగావాట్ల స్పిన్నింగ్ రిజర్వ్‌ను (విద్యుత్తు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగినా.. ఏదైనా యూనిట్ అనుకోకుండా నిలిచిపోయినా వెంటనే అందుబాటులోకి వచ్చేలా సిద్ధంగా ఉంచే అదనపు సామర్థ్యాన్ని స్పిన్నింగ్ రిజర్వ్ అంటారు) కూడా పొందుపరిచామని తెలిపారు. అక్టోబరులో 893.38 ఎంయూలు, నవంబరులో 737.40, డిసెంబరులో 718.25, వచ్చే జనవరిలో 503.47, ఫిబ్రవరిలో 485.80, మార్చిలో 846.30 ఎంయూల చొప్పున కొనుగోలుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సమీక్ష సమావేశంలో జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
డిస్కంలకు రూ.2,050 కోట్ల సబ్సిడీ విడుదల
విద్యుత్తు పంపిణీ సంస్థల(డిస్కంలు)కు వ్యవసాయ, ఇతర విద్యుత్తు సబ్సిడీల కింద రూ.2,050.41 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీడీసీఎల్‌కు రూ.1,337.10 కోట్లు, సీపీడీసీఎల్‌కు రూ.444.87 కోట్లు, ఈపీడీసీఎల్‌కు రూ.268.43 కోట్లు విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు