Share News

వరమల్లే వచ్చిందీ వాన!

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:41 AM

సీమలో చినుకుల సవ్వడినుంచి కోస్తాలో జడివాన మొదలుకుని.. ఉత్తరాంధ్రలో అతిభారీ వానలతో పుడమి పులకరించింది! ఇన్నాళ్లకు కురిసిన వాన.. పంటకు ప్రాణం పోసింది. వాగులూ వంకలకు జల కళ తెచ్చింది.

వరమల్లే వచ్చిందీ వాన!

  • ఖరీఫ్‌ పంటలకు ప్రాణం పోసిన వర్షాలు

  • ఎండుతున్న వరికి ఊపిరి.. పత్తి, తమలపాకు, కూరగాయలు, మిర్చికి మేలు

  • రాష్ట్రమంతటా జోరు వాన.. 55 శాతం నుంచి 41. 5 శాతానికి తగ్గిన లోటు

  • ఉత్తరాంధ్రపై వాయుగుండం తీవ్ర ప్రభావం.. జలాశయాలకు వరద

  • పొర్లుతున్న వాగులు.. నిజాంపట్నం రేవులో 1వ నంబరు ప్రమాద హెచ్చరిక

కన్నీళ్లే తప్ప నీళ్లన్నవి కనిపించక..

నైరుతి కాలం కరిగిపోతున్నా చినుకు రాలక..

అడపాదడపా వచ్చిన అల్పపీడనాలూ అక్కరకు రాక..

జలాశయాల ఆశలన్నీ అడుగంటి పోతున్న వేళ..

పంటలు వేసిన రైతులు ఆశగా ఆకాశానికేసి చూస్తుండగా..

అదృష్టంకొద్దీ ఒక అల్పపీడనం వచ్చింది..

తీవ్ర వాయుగుండమై మెరిసింది..

ఎల్‌నినోని ఎదిరించి మరీ గర్జించింది..

దాదాపు రాష్ట్రమంతటా వరమల్లే వాన కురిసింది!

సీమలో చినుకుల సవ్వడినుంచి కోస్తాలో జడివాన మొదలుకుని.. ఉత్తరాంధ్రలో అతిభారీ వానలతో పుడమి పులకరించింది! ఇన్నాళ్లకు కురిసిన వాన.. పంటకు ప్రాణం పోసింది. వాగులూ వంకలకు జల కళ తెచ్చింది.

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): ఖరీఫ్‌ ముగింపునకు వచ్చి, సీజన్‌ నిరాశ పరిచిందనుకున్న తరుణంలో రాష్ట్రమంతటా కరువుతీరా వానలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఇటు ఇచ్ఛాపురం నుంచి అటు తడ, రాయలసీమ జిల్లాల వరకు విస్తారంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాతల మోములో తిరిగి కళ కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో నిన్నటి వరకూ వానలు లేక, ఉష్ణోగ్రతలు తట్టుకోలేక జనం అల్లాడిపోయారు. రాష్ట్రానికీ, రైతాంగానికీ యాంటీ క్లైమాక్స్‌ తప్పదని వాతావరణ శాఖ ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో వరుణుడి రాకతో పంటలకు ప్రాణం తిరిగొచ్చింది. వర్షాల రాకతో వరి పంటకు జీవం వచ్చిందని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణ ప్రజలు సేద తీరుతున్నారు. ఎల్‌ నినో ప్రభావంతో గుంటూరు జిల్లాలో వరి సాగుని రైతులు ఆలస్యంగా చేపట్టారు. నెలన్నర క్రితమే నాట్లు వేశారు. ఎండ వేడిమి, సాగునీటి లభ్యత సరిగా లేకపోవడంతో ఎదుగుదల లేదు. రెండురోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు వరితో పాటు పత్తి, తమలపాకు, కూరగాయల పంటలకు మేలు చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు కోనసీమ జిల్లాలో అన్నదాతలకు ఊరటనిచ్చాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్నిప్రాంతాల్లోనూ వర్షం కురవడంతో ఇంతకాలంగా సాగునీరు అందక ఎండిపోయేస్థితికి చేరుకున్న 1.43 లక్షల హెక్టార్లలోని వరిపైరుకు జీవం తిరిగొచ్చింది.


ఉత్తరాంధ్రలో..

తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రానికి తీరానికి సమీపంగా రావడంతో విశాఖ నగరం, శివారు ప్రాంతాల్లో వర్షాలు, గాలులు పెరిగాయి. గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడా చెట్లు, చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. అనకాపల్లి జిల్లాలో సగటున 27.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోజంతా వర్షం కురుస్తూనే ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైనుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం నాటి తీవ్రత లేనప్పటికీ బుధవారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చగా, డుంబ్రిగుడ మండలం చాపరాయి జలవిహారిలో సైతం వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతగిరి మండలం కాశీపట్నం గ్రామంలో సాయం త్రం ఓ భారీ వృక్షం నేలకొరిగింది.

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వంశధార ఎడమ ప్రధాన కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రెం డు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, చెరువులు, పంటపొలాలు జలమయమై పోయాయి. ఉద్దానం ప్రాంతంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. తీరప్రాంతాల్లో సముద్రం కొన్ని మీటర్ల ముందుకొచ్చింది. రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకు తీరప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 81.2 మిల్లీమీటర్లు, కనిష్ఠంగా సంతకవిటి మండలంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


బియ్యం ఎగుమతులు నిలిపివేత

కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. బియ్యం కార్గోతో ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన నౌకలకు బుధవారం బియ్యం లోడింగ్‌ నిలిపివేశారు. సుమారు 16వేల మెట్రిక్‌టన్నుల బియ్యం నౌకల్లోకి లోడ్‌ చేయకుండా బెర్త్‌ల్లోనే బార్జిల్లో ఉంచేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడకు చెందిన 23బోట్లు ఒడిశాలోని గంజాం జిల్లాలో చిక్కుకుపోగా అక్కడ మత్స్యకారులు కాపాడారు.

1వ నంబరు ప్రమాద సూచిక

సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటం, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో 1వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక ఎగురవేసినట్టు పోర్టు అధికారులు తెలిపారు. సముద్రంలో వేట చేసే మత్స్యకారులంతా తక్షణమే ఒడ్డుకు చేరాలని వాకీటాకీల ద్వారా సమాచారం అందించారు. గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి విడతలు విడతలుగా వర్షం కురిసింది. జిల్లాలోని 18 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పొన్నూరులో 16.37 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయంతో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్‌లు రూంలు ఏర్పాటు చేశా రు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం 627 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా తిరువూరులో 99 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో బుధవారం సాయంత్రం ఐదు గంటలవరకు జిల్లా సగటు వర్షపాతం 32.2 మిల్లీమీటర్లుగా నమోదైంది.


సీమకు చినుకు కళ

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన వర్షాలకు తడిచి ముద్దయ్యాయి. అత్యధికంగా విడపనకల్లులో 5.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. బేతంచర్ల మండలంలో అత్యధికంగా 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాగలమర్రి మండలంలోని రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. కడప జిల్లాలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుఽధవారం ఉదయం 9గంటల వరకు 10.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా సిద్దవటం మండలంలో 38.2 మిల్లీమీటర్ల వాన నమోదైంది.

తడిచిన గోదావరి జిల్లాలు

తూర్పుగోదావరి జిల్లాలోని 22 మండలాల్లో మంచి వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో సగటున 49.3 శాతం వర్షం కురిసింది. గోపాలపురంలో అత్యధికంగా 89.0 మిల్లిమీటర్లు, బిక్కవోలులో అత్యల్పంగా 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో గత 33 గంటల్లో జిల్లాలో అత్యధికంగా కొయ్యలగూడెం మండలంలో 112.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వేలేరుపాడు మండలంలో పెదవాగు ఉధృతంగా పొంగింది. జంగారెడ్డిగూడెం సమీపంలోని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి 100 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం నీటిమట్టం 77.80 మీటర్లుగా ఉంది. అధికారులు ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు. కాళ్లలో రాష్ట్రీయ రహదారిపై భారీగా వర్షపునీరు నిలిచింది. నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చినలంక, పీఎంలంక, కేపీపాలెం వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. వేటకు వెళ్లిన బోట్లని చినలంక, అంతర్వేది వద్ద చేరుకుంటున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నరసాపురంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 24 , 2026 | 04:41 AM