మార్గదర్శకాలు ఇవ్వండి మహాప్రభో!
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:15 AM
రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు కోసం పది వేల మందికి పైగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2004 సెప్టెంబరు 1 కంటే ముందు ఉద్యోగ నియామక ప్రకటన వెలువడి, ఆ తర్వాత సర్వీసులో చేరిన వారికి...
ఓపీఎస్ గైడ్‌లైన్స్ కోసం 10,715 మంది నిరీక్షణ
3 నెలల క్రితమే క్యాబినెట్ ఆమోదం.. జీవో జారీ
నేటికీ కదలని అధికారులు.. ఉద్యోగుల్లో ఆందోళన
పెన్షన్‌పై ఆప్షన్ ఎంపికకు ముంచుకొస్తున్న గడువు
ఏ ఆప్షన్ ఎంచుకోకపోతే సీపీఎస్‌లోనే కొనసాగింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు కోసం పది వేల మందికి పైగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2004 సెప్టెంబరు 1 కంటే ముందు ఉద్యోగ నియామక ప్రకటన వెలువడి, ఆ తర్వాత సర్వీసులో చేరిన వారికి ఓపీఎస్ వర్తింపజేసేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం జూన్ 23న ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా జూలై 13న ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు ఓపీఎస్ అమలుపై మార్గదర్శకాలు వెలువడలేదు. కొందరు అధికారుల తీరు కూటమి ప్రభుత్వానికి శాపంగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 11వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా సీఎం చంద్రబాబు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నా దాని అమలులో కాలయాపన కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడంలేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీపీఎస్ ఉద్యోగి ఓపీఎ్‌సలోకి మారడానికి ఏ విధంగా ఆప్షన్ ఇవ్వాలి? అర్హతను ఏ విధంగా నిర్ధారిస్తారు? ఇప్పటికే ఫ్రాన్ ఖాతాల్లో జమ అయిన ఉద్యోగి, ప్రభుత్వ వాటాల నిధుల పరిస్థితి ఏమిటి? తదితర అంశాలపైనా మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.
పూర్తి కావొస్తున్న గడువు
2004 సెప్టెంబరు 1కి ముందు నియామక ప్రకటనలు జారీ అయి, వాటిద్వారా 2004 సెప్టెంబరు 1న లేదా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఓపీఎ్‌సను ఎంచుకునేందుకు ఒకసారి అవకాశం (ఒన్ టైం ఆప్షన్) ఇస్తూ ఆర్థికశాఖ ఈ ఏడాది జూలై 13న జీవో 53ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి నియామక ప్రకటన తేదీ, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరిన వివరాలు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులు నిర్దేశించిన పద్ధతిలో జీవో జారీ అయిన తేదీ నుంచి మూడు నెలలలోపు తమ ఆప్షన్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఓపీఎస్/ సీపీఎస్‌కు సంబంధించి ఉద్యోగి ఒకసారి ఎంచుకున్న ఆప్షన్‌ను మళ్లీ మార్చుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు. గడువులోపు ఎలాంటి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు యథావిధిగా సీపీఎ్‌సలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆప్షన్ల ప్రక్రియ, ఓపీఎస్‌ను ఎంచుకునే ఉద్యోగుల సీపీఎస్ నిధుల నిర్వహణపై వివరణాత్మక అమలు మార్గదర్శకాలను ఆర్థికశాఖ, ట్రెజరీస్ జారీ చేస్తాయని జీవోలోనే తెలిపారు. ఈ నెల 13తో మూడు నెలల గడువు పూర్తికానుంది. అయినా సీపీఎస్ ఉద్యోగులు ఓపీఎస్‌లోకి మారటానికి అధికారులు ఇంతవరకూ మార్గదర్శకాలను ఇంతవరకు జారీ చేయకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే అమలు మార్గదర్శకాలు విడుదల చేసి, ఆప్షన్ గడువుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగులు కోరుతున్నారు.
ఆర్థికశాఖ నుంచి సీఎఫ్ఎస్ఎస్‌కు...
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసే అంశంపై అధికారులు కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఫైల్ ఆర్థికశాఖ నుంచిసీఎఫ్ఎస్ఎస్‌కు, మళ్లీ అక్కడ నుంచి ఆర్థికశాఖకు చక్కర్లు కొడుతోందని చెబుతున్నారు. గైడ్‌లైన్స్ ఇవ్వడానికి జీవోలో పేర్కొన్న సమయం దగ్గర పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నా... గడువు ముగిసిపోతే మళ్లీ పొడిగిస్తామని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏమాత్రం కదలిక లేదని వాపోతున్నారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాల్లో సీఎం చంద్రబాబు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా కొందరు అధికారుల నిర్లక్ష్య వైఖరితో వాటి అమలులో బ్రేకులు పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ సీఎం జోక్యం చేసుకుంటే తప్ప ఓపీఎస్ మార్గదర్శకాలు విడుదలయ్యే పరిస్థితి లేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు