Share News

అసత్య ప్రచారాలు మానండి

ABN , Publish Date - Aug 11 , 2026 | 06:25 AM

అత్యంత పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై డీఎస్సీ అంటే తెలియని వైసీపీ నేతలు, పేటీఎం బ్యాచ్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విద్యార్థి, యువజన...

అసత్య ప్రచారాలు మానండి

  • లేకుంటే ఉద్యోగాలు పొందిన టీచర్లే బుద్ధి చెబుతారు

  • కష్టపడి చదువుకున్నవారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు

  • బెజవాడ ప్రెస్‌మీట్‌లో విద్యార్థి, యువజన సంఘాల ధ్వజం

  • అసత్య ఆరోపణలతో ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు

  • మార్కాపురంలో మెగా డీఎస్సీ-2025 టీచర్ల భారీ ర్యాలీ

విజయవాడ (గాంధీనగర్‌)/మార్కాపురం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అత్యంత పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై డీఎస్సీ అంటే తెలియని వైసీపీ నేతలు, పేటీఎం బ్యాచ్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విద్యార్థి, యువజన సంఘాలు భగ్గుమన్నాయి. మెగా డీఎస్సీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినవారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించాయి. సోమవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో పలు విద్యార్థి, యువజన సంఘాలు నేతలు మాట్లాడారు. మంత్రి లోకేశ్‌ రాజీనామ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేయడాన్ని ఖండించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించినందుకు రాజీనామ చేయాలా? రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు రాజీనామ చేయాలా? అని వైసీపీ నేతలను నిలదీశారు. కష్టపడి చదువుకుని ఉద్యోగాలు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగునాడు విద్యార్థి విభాగం (టీఎన్‌ఎ్‌సఎఫ్‌) ప్రధాన కార్యదర్శి పుల్లగూర చరణ్‌సాయి యాదవ్‌ మాట్లాడుతూ.. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఒక్క నిజమైన విద్యార్థి సంఘం కానీ నిరుద్యోగి కానీ ఉన్నారా? దొంగ దీక్షల్లో జెన్‌జీలు ఎవరున్నారు? అని ప్రశ్నించారు. తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్‌ జెన్‌జీనా, బాబాయ్‌ని చంపి గుండెపోటుగా చిత్రీకరించిన అవినాశ్‌రెడ్డి.. గంటా, అరగంటా అని మాట్లాడే అంబటి రాంబాబు, ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన విడదల రజని, విజయవాడలో కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు తీసిన మల్లాది విష్ణు, దుర్గగుడిలో వెండి సింహాలు దొంగిలించిన వెలంపల్లి శ్రీనివాస్‌, స్కూల్‌ను కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్న దేవినేని అవినాశ్‌లు జెన్‌జీలా అని ప్రశ్నించారు. జెన్‌జీల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. రైట్స్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ స్టూడెంట్స్‌ ఫోరం (ఆర్‌వైఎ్‌సఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ.. 150 రోజుల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మంత్రి లోకేశ్‌కు దక్కుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ యువమోర్చా ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు జె.శివకృష్ణారెడ్డి, యాక్షన్‌ మూమెంట్‌ జాతీయ ఉపాఽధ్యక్షురాలు తేజశ్రీ, తెలుగు యువత ఎన్‌టీఆర్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ నాగుర్‌, ఇస్లామిక్‌ యూత్‌ నాయకులు అక్బరుద్దీన్‌, గిరిజన సంఘం నేతలు రవీంద్ర నాయక్‌, నిరుద్యోగ జేఏసీ నేత అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.


మార్కాపురంలో టీచర్ల ర్యాలీ

ప్రభుత్వం డీఎస్సీ ద్వారా పారదర్శకతతో ఉద్యోగాలు భర్తీ చేస్తే అసత్య ఆరోపణలతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వైసీపీ నాయకులపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన టీచర్లు సోమవారం మార్కాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం సర్‌’, ‘థ్యాంక్యూ లోకేశ్‌ సర్‌’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోగా ఉద్యోగావకాశాలు కల్పించిన కూటమిపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ కొద్ది రోజులుగా డీఎస్సీపై చేస్తున్న దుష్ప్రచారంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్‌, పలువురు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 06:26 AM