పెద్దలు చెప్పిందే శాసనం
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:01 AM
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మళ్లీ పెద్దల మాటే నెగ్గింది. గ్రామపెద్దలు నిర్ణయించిన అభ్యర్థులనే ఎన్నుకోవడం ఈ గ్రామంలో సంప్రదాయంగా వస్తోంది.
నువ్వలరేవులో రెండు ఎంపీటీసీలూ టీడీపీకి ఏకగ్రీవం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మళ్లీ పెద్దల మాటే నెగ్గింది. గ్రామపెద్దలు నిర్ణయించిన అభ్యర్థులనే ఎన్నుకోవడం ఈ గ్రామంలో సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నించడంతో పోటీ తప్పదనే ప్రచారం జరిగింది. అయితే గ్రామస్థులు మరోసారి తమ ఐక్యతను చాటుకుంటూ.. గ్రామదేవత బృందావతి మాత ఆలయం వద్ద సమావేశమై ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రత్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు ఉపసంహరించుకోవడంతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒకటో ఎంపీటీసీ స్థానానికి బైనపల్లి జానకి, రెండో ఎంపీటీసీ స్థానానికి బెహరా అన్నపూర్ణను ఎంపిక చేశారు. వీరిని టీడీపీ తరఫున అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. దీంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయినట్టే. మంగళవారం దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. పెద్దల నిర్ణయాన్ని గౌరవించిన నువ్వలరేవు ప్రజల ఐక్యతపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వజ్రపుకొత్తూరు, ఆంధ్రజ్యోతి
విస్సాకోడేరులో తోడి కోడళ్ల సవాల్
పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరులో తోడి కోడళ్లు ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బొర్రా కోటేశ్వరరావు ఇద్దరు కుమారుల్లో లక్ష్మణరావు వైసీపీలో, సాయిబాబు టీడీపీలో ఉన్నారు. ఈ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేయడంతో సాయిబాబు భార్య లక్ష్మీచందు టీడీపీ తరపున, లక్ష్మణరావు భార్య లీలా జయదుర్గ వైసీపీ నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- పాలకోడేరు, ఆంధ్రజ్యోతి
కూతురు టీడీపీ.. తల్లి వైసీపీ
కోటశిర్లాం ఎంపీటీసీకి ఆసక్తికర పోరు
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కోటశిర్లాం ఎంపీటీసీ స్థానం అన్‌రిజర్వుడు కావడంతో తల్లీకూతుళ్లు బరిలోకిదిగి ఆసక్తికర పోరుకు తెరలేపారు. కూతురు బొప్పడాల జయలక్ష్మికి కొద్దికాలం కిందట అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమయింది. ఆమె టీడీపీ తరపున, తల్లి వెంకటలక్ష్మి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. వీరి పోరు మండలంలో ఉత్కంఠ రేపుతోంది.
- రామభద్రపురం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్