స్థానికానికి సిద్ధం!
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:54 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడం...
నేడు క్యాబినెట్ అత్యవసర భేటీ
కుదిరితే సోమవారమే షెడ్యూలు విడుదల
మొత్తం రిజర్వేషన్లు 50 శాతంలోపే!
డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు అమలు
రిజర్వేషన్ల ఖరారుపై సత్వరం జీవోలు
గెజిట్ అందగానే నోటిఫికేషన్
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడం, ‘సర్’ ప్రక్రియతో సంబంధంలేకుండా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగిరం చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు సమాయత్తమైంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం శనివారం అత్యవసరంగా సమావేశమవుతోంది. 50 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంటుంది. ఆ వెంటనే పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వేర్వేరుగా రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీచేస్తాయి. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తర్వులు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, వార్డులు.. ఇటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఆ తర్వాతే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. అన్నీ కుదిరితే సోమవారమే షెడ్యూలు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా జరిపారు. అయితే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా, పంచాయతీలకు మూడు విడతల్లో నిర్వహించాలని అధికారుల నుంచి అభ్యర్థనలు వెలువడ్డాయి. దీనిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. గతంలో మాదిరిగానే మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనరేట్లలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది.
అలాగైతే ఎన్నికలు ఆలస్యం..!
వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులను తెచ్చుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘సర్’ ప్రక్రియ పూర్తయి ఓటర్ల జాబితా వచ్చేలోపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితేనే ఎన్నికలు త్వరగా పూర్తయ్యే అవకాశముంది. ఏ కారణంతోనైనా ‘సర్’ జాబితా వెలువడేలోపు నోటిఫికేషన్లు విడుదల కాకపోతే.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ‘సర్’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. ఈ నెల 16న ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. తుది ఓటర్ల జాబితా విడుదలకు మరో వారం రోజులు పడుతుంది. ఈలోపే నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
2-3 రోజుల్లో రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి!
బీసీ రిజర్వేషన్లు ఖరారయితే.. 2-3 రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేసిన మున్సిపల్ శాఖ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. పంచాయతీరాజ్‌శాఖ మరో అడుగు ముందుకేసి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో బీసీ ఓటర్లను గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ జనాభాను ఎంపీటీసీ, పంచాయతీలవారీగా గుర్తించే విధంగా చర్యలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల రిజర్వేషన్ శాతం ఖరారైతే.. 2-3 రోజుల్లో ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను కూడా నిర్ధారిస్తారు. ఎస్సీ,ఎస్టీ జనాభా ఆధారంగా, బీసీ ఓటర్ల ఆధారంగా ఆయా మండలాల్లో పంచాయతీలవారీగా, మండల పరిషత్‌లవారీగా నివేదికలు సిద్ధమైపోయాయి. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ఒకేసారి ప్రారంభించి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందంటున్నారు.
45 రోజుల్లో ప్రక్రియ పూర్తి..!
స్థానిక ఎన్నికల నిర్వహణకు శనివారం క్యాబినెట్ నిర్ణయించిన తర్వాత.. మొదటగా మున్సిపల్ ఎన్నికలకు సోమవారం (12న) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. శనివారం సాయంత్రంలోపు రిజర్వేషన్ల జీవోలు వెలువడితే సోమవారం ఎస్‌ఈసీ షెడ్యూల్ ప్రకటించవచ్చని అంటున్నారు. ఒక్క రిజర్వేషన్ల నిర్ధారణ తప్ప ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తిచేసినట్లు పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖలు ప్రభుత్వానికి నివేదించాయి. మున్సిపల్ ఎన్నికలు 15 రోజుల్లో, పరిషత్ ఎన్నికలు 16 రోజుల్లో, పంచాయతీలకు 14 రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఇప్పటికే వెల్లడించారు. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
2011 జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. బీసీల రిజర్వేషన్లను ఓటర్ల ఆధారంగా గుర్తించే ప్రక్రియను మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు పూర్తి చేశాయి. డెడికేటెడ్ కమిషన్ తన నివేదిక తయారుచేసే క్రమంలో బీసీ జనాభాకు సంబంధించి యునిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ల నిర్ధారణకు ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకోవాలా.. ఈ సర్వేను పరిగణనలోకి తీసుకోవాలా అనే విషయంపై క్యాబినెట్ చర్చించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు