స్కామ్‌లో స్కామ్!
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:22 AM
గత జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో దేన్నీ వదలకుండా దోపిడీ చేశారు. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం నుంచి డెన్లలో దాచడం...
నాడు మద్యం రవాణాలోనూ దోపిడీ
ఆధారాలతో సహా తేల్చిన ‘సిట్’
మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో దేన్నీ వదలకుండా దోపిడీ చేశారు. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం నుంచి డెన్లలో దాచడం, సొమ్ములు దారి మళ్లించడం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, నిందితులు జల్సాలు చేయడం వరకు సిట్ విచారణలో ఎన్నో వెలుగు చూశాయి. అంతేగాక.. మద్యం బాక్సుల రవాణాలోనూ భారీ దోపిడీ జరిగింది. మద్యం బాక్సుల సరఫరా ధరను పెంచి ఏకంగా 400 కోట్లు దోచేశారు. లిక్కర్ స్కామ్‌లో ఇది మరో స్కామ్ అన్నమాట. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు మద్యం డిపో నుంచి షాపునకు ఒక కేసు(బాక్సు) సరఫరా చేస్తే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సరఫరాదారుకు రూ.13 చెల్లించేది. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరుస్తానని పైకి చెప్పిన జగన్.. అందుకు భిన్నంగా ఖజానాకు నష్టం కలిగించారు. గత ప్రభుత్వంలో ఒక బాక్సు మద్యం సరఫరా ధరను రూ.13 నుంచి అనూహ్యంగా రూ.34కు పెంచేసి దోపిడీకి దారులు వేశారు. జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి, నాటి మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, కేంద్ర సర్వీసుల నుంచి ఏరికోరి తెచ్చుకున్న వాసుదేవ రెడ్డి సహా మరికొందరి పాత్రకు సంబంధించి ఇదివరకే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దోపిడీ గుట్టు రట్టు చేసింది. ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మరిన్ని ఆధారాలు వెలికి తీసింది. వాటి ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత లోతుగా ఆరా తీస్తోంది. మనీలాండరింగ్ కోణాన్ని పసిగట్టి అరెస్టులు మెదలు పెట్టింది.
నాడు ఏం చేశారంటే..
మద్యం నిషేధిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేసింది. కమీషన్లు తీసుకుని వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఊరూ పేరూ లేని బ్రాండ్లను అనుమతించారు. అంతకుముందు లిక్కర్ బాక్సుల్ని మద్యం డిపోల నుంచి వైన్ షాపు(ఎంత దూరమైనా) వరకూ చేర్చేందుకు సరఫరాదారుకు 13 రూపాయలు జాయింట్ కలెక్టర్ల ద్వారా చెల్లించేవారు. అయితే జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డికి నమ్మినబంటు లాంటి తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి టెకార్ లాజిస్టిక్ పేరుతో వ్యాపారం చేసేవాడు. మద్యం సరఫరా కాంట్రాక్టు తనకు ఇప్పిస్తే ప్రతి నెలా ముడుపులు ఇస్తానని ఆఫర్ చేశాడు. దీంతో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డితో రాజ్ కసిరెడ్డి చర్చించాడు. జాయింట్ కలెక్టర్ల పరిధిలో ఉన్న సరఫరా విధానాన్ని కేంద్రీకృతం చేసి ఏపీఎ్‌సబీసీఎల్ ద్వారా సరఫరా చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అందరూ ఏకమై మద్యం రవాణాను కేంద్రీకృతం చేశారు. ఒక్కో బాక్సు సరఫరాకు ఏకంగా 34 రూపాయలకు ధర పెంచేశారు. తుకేకుల కిరణ్, రాజ్ కసిరెడ్డి కలిసి సిగ్మా లాజిస్టిక్స్ అనే సంస్థను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. రాజ్ కసిరెడ్డి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు సైతం ఇచ్చారు. అందులో భాగంగా అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కుటుంబానికి చెందిన మరో లాజిస్టిక్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అప్పగించారు. గత వైసీపీ పాలనలో అందరూ కలిసి అడ్డూ అదుపూ లేకుండా వందల కోట్ల రూపాయలు దోచేశారు.
195 కోట్ల మనీ లాండరింగ్?
మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు చేసి నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఏపీ సిట్ వాటిని ఈడీకి అందజేసింది. ఈసీఐఆర్ నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు రాజ్ కసిరెడ్డితో పాటు వాసుదేవ రెడ్డి తదితరుల్ని పిలిచి విచారించారు. వందల కోట్ల రూపాయల లావాదేవీల్లో హవాలా, మనీలాండరింగ్ కోణాలపై ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో కింగ్‌పిన్‌గా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీల్లో రూ.195.33 కోట్ల వరకూ అనుమానిత లావాదేవీలు ఉన్నట్టు గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా రాజ్ కసిరెడ్డితో పాటు ఏపీఎ్‌సబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఆయన బామ్మర్ది విజయ్ నరసింహారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు వల్లూరి కీర్తి, రాజ్ కసిరెడ్డి గ్యాంగ్‌లోని సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య ఉన్నారు. వీరిలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డిని అరెస్టు చేసి ఈడీ అధికారులు ఇంకా ఎవరెవరిని జైలుకు పంపుతారనే భయం వైసీపీ వర్గాల్లో నెలకొంది.