Share News

పునరుత్పాదక పెట్టుబడుల సమీకరణలో ఏపీ అగ్రస్థానం

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:09 AM

పర్యావరణహిత హరిత ఇంధన రంగంలో పెట్టుబడులను సమీకరించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆకర్షించి జాతీయ స్థాయిలో...

పునరుత్పాదక పెట్టుబడుల సమీకరణలో ఏపీ అగ్రస్థానం

  • జాతీయ పురస్కారం అందజేసిన కేంద్రమంత్రి

  • బాబు దూరదృష్టిని కొనియాడిన ప్రహ్లాద్‌ జోషి

  • రాష్ట్రానికి 4 లక్షల కోట్ల విలువైన 97 ప్రాజెక్టులు

  • ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీకి రూపకల్పన

  • 4.71 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత హరిత ఇంధన రంగంలో పెట్టుబడులను సమీకరించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆకర్షించి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. చెన్నై ట్రేడ్‌ సెంటర్‌లో గురువారం నిర్వహించిన 8వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సదస్సు ‘విండర్టీ ఇండియా-2026’లో ప్రతిష్టాత్మక ‘లీడర్‌షిప్‌ స్టేట్‌ ఇన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొబిలైజేషన్‌’ అవార్డును ఏపీ దక్కించుకుంది. రూ.4 లక్షల కోట్లతో 97 భారీ పునరుత్పాదక ప్రాజెక్టులు మంజూరు చేయడంతోపాటు 4.71 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు మార్గం సుగమం చేసినందుకుగాను ఏపీకి ఈ అవార్డు దక్కింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, తమిళనాడు ఇంధన శాఖ మంత్రి సీటీఆర్‌ నిర్మల్‌ కుమార్‌ చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.కమలాకర్‌బాబు అందుకున్నారు.


ఈ సందర్భంగా ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దూరదృష్టితో రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024తో రాష్ట్రం గ్రీన్‌ ఎనర్జీ విస్తరణలో సంప్రదాయ వనరులకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికలతో కూడిన సమగ్ర ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ముందంజలో నిలిచిందని కొనియాడారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వేగవంతమైన అనుమతులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ కారిడార్లను అభివృద్ధి చేయడంలో ఏపీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్నాయన్నారు. కమలాకర్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:09 AM