Share News

హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు మంత్రి ఓఎస్‌డీ షాక్‌!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:39 AM

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పునర్నియామక (రీ-ఇండక్షన్‌) ప్రక్రియ మళ్లీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ కార్పొరేషన్‌లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగేందుకు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు మంత్రి ఓఎస్‌డీ షాక్‌!
AP Housing Corporation

ఇప్పటికే ఇచ్చిన రీపోస్టింగ్‌ ఆర్డర్లు కూడా ఆపాలని కార్యదర్శికి లేఖ

ఓఎస్‌డీ లేఖతో రిటైర్డ్‌ సిబ్బందిలో కలకలం

అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పునర్నియామక (రీ-ఇండక్షన్‌) ప్రక్రియ మళ్లీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ కార్పొరేషన్‌లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగేందుకు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే సర్వీసు పొడిగింపునకు అర్హత పొందిన అన్ని క్యాడర్లలోని రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారులకు ఇప్పటికే ఇచ్చిన రీ పోస్టింగ్‌ ఆర్డర్లు సహా మొత్తం రీ-ఇండక్షన్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలంటూ గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ఓఎస్‌డీ (ప్రత్యేకాధికారి) ఎన్‌.ప్రకాశరావు ఆ శాఖ కార్యదర్శి హెప్సిబాకు తాజాగా లేఖ రాశారు (ఈమె సోమవారమే బాధ్యతలు చేపట్టారు). ఈ అంశంపై మంత్రి సమీక్ష పూర్తయ్యేవరకు అన్ని క్యాడర్ల ఉద్యోగులు, అధికారుల రీపోస్టింగ్‌ల(పునర్నియామకాలు) నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం పునర్నియామక ఉత్తర్వులిచ్చి నెల దాటిపోయింది.


ఇతర కార్పొరేషన్లలో పునర్నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. హౌసింగ్‌ కార్పొరేషన్‌లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాజాగా ఓఎస్‌డీ లేఖ రాసి అడ్డుపుల్ల వేయడం కలకలం రేపుతోంది. నానా పాట్లు పడి పదవీ విరమణ వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచుకుంటే.. రీపోస్టింగ్‌ ఆర్డర్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ బాధిత రిటైర్డ్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు. రీపోస్టింగులకు రేట్లు నిర్ణయించి.. జిల్లాల్లో పనిచేసే ఏఈ రూ.50 వేలు, డీఈ రూ.లక్ష చొప్పున, ఈఈల నుంచి ఎస్‌ఈలు, జనరల్‌ మేనేజర్ల స్థాయి వారైతే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమవసూళ్లకు స్కెచ్‌ వేసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే ప్రత్యేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.


300 మంది నుంచి సమ్మతి లేఖలు..

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, సొసైటీలు, వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం గతనెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల జనరల్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌ జైన్‌ గత నెల 27న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ వెంటనే అన్ని జిల్లాల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసినవారిలో పునర్నియామకానికి అర్హులైన 300 మందికి పైగా రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారుల నుంచి హౌసింగ్‌ ఉన్నతాధికారులు రీజాయినింగ్‌ల కోసం విల్లింగ్‌ లెటర్స్‌ తీసుకున్నారు. వీరిలో అసిస్టెంట్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్‌ క్యాడర్ల ఉద్యోగులకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆమోదంతో జిల్లా స్థాయిలోనే పోస్టింగ్‌ ఆర్డర్లు జారీ చేయాలని అన్ని జిల్లాల హౌసింగ్‌ అధిపతులను ఆదేశిస్తూ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ అరుణ్‌బాబు ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు.

డీఈ స్థాయి అధికారులకు ఎండీ ఇప్పటికే రీపోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. జిల్లాల్లోనూ చాలావరకు పోస్టింగ్‌ ఆర్డర్లు జారీ చేసేశారు. ఇక ఈఈలు, జనరల్‌ మేనేజర్లు, ఎస్‌ఈలు, సీఈ స్థాయి అధికారుల పునర్నియామకాలకు ప్రభుత్వ అనుమతి కోసం ఫైల్‌ పంపించారు. అంతా సాఫీగా జరిగిపోతుందని వారంతా ఆనందంతో ఉన్న సమయంలో మంత్రి ఓఎస్‌డీ అడ్డుకోవడంపై హౌసింగ్‌ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. తమకు హక్కుగా రావలసిన పునర్నియామక ఉత్తర్వుల కోసం ఏకంగా రూ.లక్షల్లో ముడుపులు చెల్లించాలనడం సమంజసంగా లేదని వాపోతున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 07:40 AM