Share News

మానసిక స్థైర్యంతో ముందడుగు వేయండి

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:51 AM

శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 2025-26వ బ్యాచ్‌ కు 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.

మానసిక స్థైర్యంతో ముందడుగు వేయండి

  • పోలీసు శాఖలో కానిస్టేబుళ్లే వెన్నెముక

  • మహిళలు పోలీసులుగా ఉంటే.. బాధితులకు మరింత ధైర్యం: అనిత

  • 473 మంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

విజయనగరం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 2025-26వ బ్యాచ్‌ కు 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. హోంమంత్రి మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను తిలకించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలను అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించారు. మహిళా కానిస్టేబుళ్లను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ.. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు వెన్నెముకని కొనియాడారు. ముఖ్యంగా మహిళలు కానిస్టేబుల్‌గా ఉంటే.. స్టేషన్‌కు భయంతో వచ్చే బాధిత మహిళలకు మరింత ధైర్యంగా ఉంటుందన్నారు. మహిళలు, బాలికల రక్షణ బాధ్యత వీరిపై ఉంటుందన్నారు. పోలీసుల వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, దానివల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని అన్నారు.

అందుకే పోలీసు శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నియామకాలు చేపట్టడమే కాకుండా, శిక్షణలో క్యాడెట్స్‌కు ఇచ్చే స్టైఫండ్‌ను రూ.12 వేలకు పెంచారని చెప్పారు. కుటుంబ బాధ్యతలను చూస్తూ ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తించడం ఎంతో కష్టమని, అది మహిళలకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగానికి పంపించిన వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ రాంసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసుల నాయుడు, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్‌ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 03:53 AM