Share News

సహేతుక కారణాలుంటేనే పీడీ ఉత్తర్వులు

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:09 AM

అధికార పరిధి వెలుపల జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకొని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ) యాక్ట్‌ కింద ఇచ్చే ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది.

సహేతుక కారణాలుంటేనే పీడీ ఉత్తర్వులు

  • బెయిల్‌ షరతులు పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చే ఆ ఉత్తర్వులు చట్టబద్ధంకాదు: హైకోర్టు

  • ఓ కేసులో నెల్లూరు కలెక్టర్‌ ఉత్తర్వులు, జీవో రద్దు

అమరావతి, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): అధికార పరిధి వెలుపల జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకొని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ) యాక్ట్‌ కింద ఇచ్చే ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కారణాలు చూపకుండా, బెయిల్‌ షరతులు పరిగణనలోకి తీసుకోకుండా జారీ చేసే పీడీ ఉత్తర్వులు చట్టబద్ధం కావని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌ ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. నెల్లూరుజిల్లా, వేదాయపాలెం త్యాగరాయరాయ నగర్‌కు చెందిన దేవళ్ల జయప్రకాశ్‌ను గూండాగా పరిగణిస్తూ ఏపీ పీడీ చట్టం-1986 లోని సెక్షన్‌ 3(1), 3(2) కింద జిల్లా కలెక్టర్‌/జిల్లా మేజిస్ట్రేట్‌ 2025 డిసెంబరు 2న నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. చిల్లకూరు, గూడూరు రూరల్‌, వేదాయపాలెం పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కలెక్టర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ సాధారణ పరిపాలనశాఖ 2026 ఫిబ్రవరి 2న జీవో ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించడంతో పాటు తన భర్తను కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జయప్రకాశ్‌ సతీమణి దివ్య హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.


పీడీ చట్టం కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు డిటైనింగ్‌ అథారిటీ తన పరిధికి వెలుపల నమోదైన కేసులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని, అయితే ఆ ఘటనలు డిటైనింగ్‌ అథారిటీ పరిధిలో శాంతి భద్రతలకు ఏవిధంగా భంగం కలిగిస్తాయో స్పష్టమైన కారణాలను ఉత్తర్వుల్లో నమోదు చేయాలని తేల్చిచెప్పింది. పీడీ ఉత్తర్వులు ఇవ్వడానికి గల కారణాలు పేర్కొంటూ కౌంటర్‌ అఫిడవిట్లలో ఇచ్చే వివరణలు చెల్లవని స్పష్టం చేసింది. అలాగే నిర్బంధించే ముందు ఏవైనా నేరాల్లో అప్పటికే అతను బెయిల్‌పై ఉంటే, బెయిల్‌ షరతులు నేరాలను అరికట్టడానికి సరిపోవా? పీడీ చట్టం కింద నిర్బంధించాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని పేర్కొంది. ఈ అంశాలను పరిశీలించకుండా జారీ చేసే ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావంది. ప్రస్తుత కేసులో దేవళ్ల జయప్రకాశ్‌పై పీడీ చట్టం కింద ఉత్తర్వులు ఇచ్చే విషయంలో కలెక్టర్‌ ఈ అంశాలను పరిశీలించలేదని, ఈ నేపథ్యంలో ఉత్తర్వులు, వాటిని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రామ్‌లక్ష్మణ్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 05:09 AM