జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదిస్తారా?
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:33 AM
కోర్టు హాలులో జరిగిన విషయాలను వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడం ఏమిటంటూ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన బెంచ్ అసహనం వ్యక్తం చేసింది.
జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదిస్తారా?
కోర్టులో విషయాలను వీడియో తీసి పోస్టు చేస్తారా?
న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం
జడ్జీలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ధర్మాసనం
తగిన మర్యాద పాటించాలని సూచన
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కోర్టు హాలులో జరిగిన విషయాలను వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడం ఏమిటంటూ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అడ్వకేట్ ఫీజుల విషయంలో కోర్టులు ఇప్పటికే స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని, అధ్యయనం చేసి ప్రతులు తమ ముందు ఉంచాలని ఆదేశిస్తే, తమకు అన్య ఉద్దేశాలు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. కోర్టు హాలులో తగిన మర్యాద పాటించాలని జడ శ్రవణ్‌కుమార్‌కు సూచించింది. రహదారిపై విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన శ్రవణ్‌కుమార్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జడ శ్రవణ్‌కుమార్ బదులిస్తూ....నాడు కేసు విచారణ సందర్భంగా తగినంత సమయం లభించలేదని, తీర్పు ప్రతుల కోసం సుదీర్ఘ కాలంపాటు వాయిదా వేయడం సరికాదని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు.
బెంచ్ పట్ల ఎలాంటి తప్పుడు ఆరోపణా చేయలేదని, కోర్టుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అయితే, ఈ వాదనను తాము అంగీకరించలేమని ధర్మాసనం తెలిపింది. పిల్‌పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. కాగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్ ఫీజు చెల్లించారని ఆరోపిస్తూ ఇటీవల విశ్రాంత రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
దీంతో ‘పిటిషనర్‌కు కేవలం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రానే ఎందుకు కనిపించారు? ఏళ్ల తరబడి ఎంతోమందికి ఫీజులు చెల్లించారు? వాటిని వ్యాజ్యంలో ఎందుకు లేవనెత్తలేదు?.’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తదనంతరం శ్రవణ్ కుమార్ దీనిపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వీడియో విడుదల చేశారు.