Share News

అనధికార లేఅవుట్‌లోని ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:51 AM

అనధికార లేఅవుట్‌లో నిర్మించుకున్న నివాస గృహానికి గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) లేదనే కారణంతో విద్యుత్‌ కనెక్షన్‌ నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. విద్యుత్‌ సరఫరా సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం..

అనధికార లేఅవుట్‌లోని ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిందే

  • పంచాయతీ ఎన్‌వోసీ లేదంటూ నిరాకరించడానికి వీల్లేదు: హైకోర్టు

  • పిటిషనర్‌ వినతిపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోండి

  • అన్ని అర్హతలూ ఉంటే కనెక్షన్‌ ఇవ్వండి

  • డిస్కం అధికారులకు న్యాయమూర్తి ఆదేశం

అమరావతి (ఆంధ్రజ్యోతి): అనధికార లేఅవుట్‌లో నిర్మించుకున్న నివాస గృహానికి గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) లేదనే కారణంతో విద్యుత్‌ కనెక్షన్‌ నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. విద్యుత్‌ సరఫరా సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం.. ఆక్రమణదారులు, ఇంటి హక్కుదారులు కూడా కరెంటు కనెక్షన్‌ పొందేందుకు అర్హులని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న పిటిషనర్‌కు కనెక్షన్‌ నిరాకరించడం సరికాదని పేర్కొంది. ఆయన దరఖాస్తును పరిశీలించి, అన్ని అర్హతలూ ఉంటే కనెక్షన్‌ మంజూరు చేయాలని ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీఈపీడీసీఎల్‌) అధికారులను ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి ఎన్‌వోసీ జారీ చేయలేదనే కారణంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదతీనర్ల గ్రామంలోని తన నూతన నివాస గృహానికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ గరికిన సత్యరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇటీవల తుదివిచారణ జరిపింది.పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.హరికృష్ణ వాదనలు వినిపిస్తూ.. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం పిటిషనర్‌ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఇచ్చినా, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న ఎన్‌వోసీ సమర్పించకపోవడంతో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదని ఏపీఈపీడీసీఎల్‌ తరఫు న్యాయవాది వీవీ సతీశ్‌ తెలిపారు.

Updated Date - Aug 04 , 2026 | 07:51 AM