ఎస్సీ,ఎస్టీ కేసుల్లో 30 రోజుల్లోనే దర్యాప్తు
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:12 AM
ఎస్సీ,ఎస్టీ కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వేధింపులతోనే తన కుమారుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, సీబీఐతో దీనిపై విచారణకు ఆదేశించాలని తండ్రి వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
చట్ట ప్రకారం ఆ బాధ్యత పోలీసులదే
కేసు ఉపసంహరణకు బెదిరించొద్దు
క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ,ఎస్టీ కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వేధింపులతోనే తన కుమారుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, సీబీఐతో దీనిపై విచారణకు ఆదేశించాలని తండ్రి వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, నార్త్ జోన్ ఏసీపీ, కృష్ణలంక ఎస్‌హెచ్‌వో, ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్‌హెచ్‌వో నాగరాజుకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ కుటుంబ సభ్యులను బెదిరించవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తన కుమారుడి ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నెలలు గడుస్తున్నా, దర్యాప్తులో పురోగతి లేదని విచారణ సందర్భంగా పిటిషనర్ వాదించారు. ‘‘సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు క్రాంతికుమార్ స్వయంగా రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడు. ఘటనపై ఈ ఏడాది మే 22న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటివరకు దర్యాప్తులో పురోగతి లేదు. గాదె సాయికృష్ణ లాక్‌పడెత్ కేసు దర్యాప్తునకు ఇచ్చిన ప్రాధాన్యం ఈ కేసుకు ఇవ్వడం లేదు. క్రాంతికుమార్ దళితుడు కావడంతోనే ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కుమారుడి మృతిపై ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని పిటిషనర్, కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. దీని వెనుక నార్త్‌జోన్ ఏసీపీ ఉన్నారు. అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి.’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ వాదనలు వినిపించారు. ‘క్రాంతికుమార్‌ది ఆత్మహత్య. సాయికృష్ణ లాక్‌పడెత్ కేసుతో పోల్చడానికి వీల్లేదు. కేసు దర్యాప్తులో ఎలాంటి వివక్షా చూపడం లేదు. పూర్తి వివరాలు కోర్టు ముందుచేందుకు సమయం ఇవ్వాలి’ అని కోరారు.
పది ద్వితీయ అప్పీళ్లను తిరస్కరించిన ఆర్టీఐ
జడ శ్రవణ్‌కుమార్ చిరునామాతో అన్ని దరఖాస్తులు
పది ద్వితీయ అప్పీళ్లను రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న డిస్మిస్ చేశారు. దాడిశెట్టి వీరబాబు ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పీఐవోల నుంచి ఏమి కావాలో అప్పీలుదారు స్పష్టంగా వివరించలేక పోయారని కమిషన్ పేర్కొంది. ద్వితీయ అప్పీళ్లకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చిరునామా వినియోగించడాన్ని, దరఖాస్తులు న్యాయవాది కార్యాలయంలో సిద్ధం చేయడాన్ని పరిగణనలోకి తీసుకుంది.