ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:25 AM
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడం హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు, ఆహార భద్రత శాఖ అధికారుల ఉమ్మడి బాధ్యత అని ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడం హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు, ఆహార భద్రత శాఖ అధికారుల ఉమ్మడి బాధ్యత అని ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని ఆహార భద్రత శాఖ కార్యాలయంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాలకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ... ఆహార పదార్థాల నాణ్యత, ముడి సరుకుల వినియోగం, నిల్వ ప్రదేశాలు, వంట గదుల పరిశుభ్రత, తయారీ, వడ్డింపు విధానాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజమండ్రిలో కలుషిత పాల ఘటనను ప్రస్తావిస్తూ..
చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీయవచ్చని అన్నారు. కురుపాం పాఠశాలలో ఆహార పదార్థాలు నిల్వ చేసిన ప్రదేశంలో ఎలుకలు, వాటి విసర్జితాలు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. నెలన్నర రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించే హోటళ్లను గుర్తించి ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తమ అధికారుల తనిఖీల్లో కృత్రిమ ఆహార రంగులు, రుచిని పెంచేందుకు వాడే నాసిరకం పదార్థాలు, నాణ్యతలేని ముడి సరుకులు, అసలైన పనీర్‌కు బదులుగా నకిలీ పనీర్ వినియోగాన్ని గుర్తించినట్లు డైరెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆహార భద్రత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు