Share News

రూ.756 కోట్లలో 400 కోట్లు పులివెందులకే

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:57 AM

గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య కళాశాలలకు పీజీ సీట్ల ద్వారా వచ్చిన రూ.756 కోట్లను మాజీ సీఎం జగన్‌ దారి మళ్లించారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు.

రూ.756 కోట్లలో 400 కోట్లు పులివెందులకే

  • వైద్య పీజీ సీట్ల నిధులు దారి మళ్లించిన జగన్‌

  • ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ధ్వజం

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య కళాశాలలకు పీజీ సీట్ల ద్వారా వచ్చిన రూ.756 కోట్లను మాజీ సీఎం జగన్‌ దారి మళ్లించారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. అందులో ఏకంగా రూ.400 కోట్లు ఒక్క పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఖర్చు చేశారని, మిగిలిన జిల్లాలను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మంజూరు చేసినఎంపీ లాడ్స్‌ నిధులు రూ.75 లక్షలతో అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అనేక వైద్య కళాశాలలను ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేస్తామని రూ.9వేల కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందని తెలిపారు. వీటికి ఎలాంటి ఫైనాన్షియల్‌ టై అప్‌ (ఆర్థిక నిధుల గ్యారెంటీ) ఇవ్వలేదని, నిధులపై స్పష్టత లేకుండానే కాంట్రాక్టర్లకు కంటితుడుపుగా అనుమతులు ఇచ్చిందని వివరించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని, కేవలం గుంతలు తవ్వి, పునాదుల వద్ద మట్టిని వేయించి పారిపోయారని విమర్శించారు. దీంతో పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు. వైద్య కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు, మౌలిక సదుపాయాలను పెంచేందుకు రూ.13,500 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వీటిని త్వరితగతిన ఆమోదింపచేసుకుని, ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తామని సత్యకుమార్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:57 AM