నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ కోసం ‘స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ’ ఏర్పాటు
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:27 PM
పులులు, ఇతర వన్య ప్రాణుల పరిరక్షణ కోసం 'స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ'ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చైర్‌పర్సన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉండనున్నారు.
అమరావతి, ఆగస్టు 31: పులులు, ఇతర వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) కోసం 'స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ' ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు జీవో ఎంఎస్ నంబర్ 42ను పర్యావరణ, అటవీ శాఖ విడుదల చేసింది. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 (సెక్షన్ 38U) ప్రకారం ఏర్పాటైన ఈ స్టీరింగ్ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్‌పర్సన్‌గా, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
పులులు, ఇతర క్రూర మృగాలు, వాటి ఆహార జీవుల పరిరక్షణతో పాటు సంరక్షణ చర్యల పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడమే ఈ కమిటీ బాధ్యత అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. స్టీరింగ్ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) & చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (CWLW) ఉండనున్నారు. అలాగే గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, సోషల్ జస్టిస్ శాఖల అధికారులతో పాటు అటవీ వన్యప్రాణి సంరక్షణ నిపుణులు డోలన ఎన్. లక్ష్మీరాణి, మూర్తి కాంతిమహంతి, గిరిజన మండలి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.