Share News

రిమాండ్‌ ఖైదీని బెదిరించిన కేసులో... విచారణ అధికారి మార్పు

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:46 AM

కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీని బెదిరించిన కేసులో విచారణ అధికారిని ప్రభుత్వం మార్చింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిపై 2023లో ఎర్రగుంట్ల పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

రిమాండ్‌ ఖైదీని బెదిరించిన కేసులో...  విచారణ అధికారి మార్పు

  • గతంలో కడప జైలులో దస్తగిరికి బెదిరింపులు

  • విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం

(కడప-ఆంధ్రజ్యోతి) : కడప సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీని బెదిరించిన కేసులో విచారణ అధికారిని ప్రభుత్వం మార్చింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిపై 2023లో ఎర్రగుంట్ల పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నెల రోజులకు పైగా దస్తగిరి కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఖైదీలకు వైద్యపరీక్షల కోసం నిర్వహించే మెడికల్‌ క్యాంపు పేరిట వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. రూ.20 కోట్లు ఇస్తామని, విచారణాధికారి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా చెప్పాలని ప్రలోభపెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. మెడికల్‌ క్యాంపు నిర్వహించిన సమయంలో విధుల్లో ఉన్నజైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ జవహర్‌బాబు, సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ పుష్పలతపై ఆరోపణలు వచ్చాయి. పుష్పలత ప్రస్తుతం కడప జీజీహెచ్‌ ఆర్‌ఎంవోగా ఉన్నారు. ప్రకాశ్‌ ప్రస్తుతం నెల్లూరు ఏపీ స్టాల్స్‌లో అటాచ్‌మెంట్‌పై పనిచేస్తున్నారు. ఈ ముగ్గురిపై ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. రాజమండ్రి కోస్టల్‌ ఆంధ్ర డివిజన్‌ డీఐజీ రవికుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులు విచారణ అధికారిని మార్చాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. దీంతో రవికుమార్‌ స్థానంలో జైళ్ల శాఖ డీఐజీ రాజేశ్వర్‌రావును విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:46 AM