ఈహెచ్‌ఎస్ వాటా ట్రస్టుకే
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:39 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) కింద వారి నుంచి సేకరించే నెలవారీ చందా మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నెలవారీ చందా, ప్రభుత్వ వాటా.. ప్రతి నెలా 1న ట్రస్టు ఖాతాకు బదిలీ
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతోపాటే హెల్త్‌స్కీమ్‌కు నిధులు
అక్టోబరు నుంచి కొత్త విధానం
క్లెయిమ్‌ల్లో జాప్యాన్ని నివారించేందుకు నిర్ణయం
ఉద్యోగుల ఆరోగ్యానికి మరింత భరోసా: ఉద్యోగ సంఘాలు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) కింద వారి నుంచి సేకరించే నెలవారీ చందా మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాను నిర్ణీత సమయంలోగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జీవో నంబర్ 131 జారీ చేశారు. అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త విధానం ద్వారా ఈహెచ్‌ఎస్ క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం జరగకుండా, ఆస్పత్రులకు సకాలంలో నిధులు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల నుంచి మినహాయించే నెలవారీ చందాలను, అలాగే ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటును ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ నేరుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు నిర్దేశిత బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇచ్చే సమయంలోనే ఈ హెల్త్‌స్కీమ్ చందాల నిధులను కూడా అదే రోజున ట్రస్టుఖాతాకు బదిలీ చేయాలి. ఈ కొత్త ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేసేలా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈవోతో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ సమన్వయం చేసుకోవాలి. గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ హెల్త్‌స్కీమ్ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వం మధ్య నిధుల వాటా నిష్పత్తి 50:50గా ఉన్న విషయం తెలిసిందే.
ఏపీఎన్జీవో హర్షం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విద్యాసాగర్, డీవీ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈహెచ్‌ఎస్ వాటాలు నేరుగా ట్రస్ట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈహెచ్‌ఎస్ కింద ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో గత కొంత కాలంగా ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నిరంతరం కృషి చేసిందన్నారు. ఈ కృషి ఫలితంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి సమకూరుతున్న కంట్రిబ్యూషన్‌తోపాటు ప్రభుత్వం అందిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా నెలకు సుమారు రూ. 34 కోట్ల నిధులు హెల్త్ స్కీమ్‌కు సమకూరుతున్నాయని తెలిపారు.
సీఎంతో భేటీలో నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు 11 ఉద్యోగసంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సెప్టెంబరు 5న సమావేశమైనపుడు ఈహెచ్‌ఎస్ ప్రస్తావన వచ్చింది. వాటాలను నేరుగా ట్రస్టుకే బదిలీ చేయడం ద్వారా జాప్యాన్ని నివారించాలని సీఎంను ఉద్యోగసంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, సమగ్ర పరిశీలన అనంతరం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..