ఎకో టూరిజంతో గిరిజన యువతకు ఉపాధి
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:37 AM
రాష్ట్ర ప్రజలను ప్రకృతితో మమేకం చేసి, వారికి మరచిపోని మధురానుభూతులను అందించడంతో పాటు ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక శోభ తెచ్చేందుకు చర్యలు
కొత్తగా మరో 6 నగర వనాలు, 3 ఎకో టూరిజం ప్రాజెక్టులు
వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలను ప్రకృతితో మమేకం చేసి, వారికి మరచిపోని మధురానుభూతులను అందించడంతో పాటు ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 6 నగర వనాలను మంగళవారం ఆయన మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే అటవీశాఖ రూపొందించిన ‘వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్ ఆఫ్ ఏపీ, ట్రీ ట్రాన్స్ లొకేషన్ మాన్యువల్’ పుస్తకాలను ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ‘యూకలిప్టస్ పల్ప్ వుడ్ ప్లాంటేషన్’ విభాగంలో సుస్థిర నిర్వహణ పద్ధతులకు గుర్తింపుగా సాధించిన ప్రమాణ్ సర్టిఫికేట్‌ను అటవీ అధికారులకు పవన్ కల్యాణ్ అందించారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ, ‘నగర వన యోజనలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే 19 నగర వనాలు ఉన్నాయి. ఇప్పుటి 6తో వీటి సంఖ్య 25కు చేరాయి. 305 హెక్టార్లలో రూ.13కోట్లతో అభివృద్ధి చేసిన ఈ నగర వనాలు కేవలం మొక్కలు నాటే ప్రాంతాలుగా కాకుండా, ప్రజలను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లేవిగా ఉండాలి. నగర వనాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, జిమ్ పరికరాల వంటివి అందుబాటులో ఉంటాయి. బాపట్ల-చీరాల తీర ప్రాంత పర్యాటక వనాలుగా ఉంటే, కోటప్పకొండ ఆధ్యాత్మిక సువాసనలతో విరాజిల్లుతోంది. వినుకొండ, దేవరంపాడు, మాచర్లలో ఏర్పాటు చేసే నగర వనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరైతే.. ఆరోగ్యం దగ్గరైనట్లే’ అని పవన్‌కల్యాణ్ చెప్పారు. ‘రాష్ట్రంలో ఎకో టూరిజం పెరగడం వల్ల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెలిగోడు జంగిల్ సఫారీతో సరికొత్త అనుభూతులు ఇస్తాయి. మారేడుమిల్లి ట్రెకింగ్, అరోమా కెనపీ వాక్ ద్వారా తూర్పు కనుమల అటవీ అందాలను ప్రకృతి పరిమళాలను ప్రజలకు చేరువ చేస్తాం. దీనివల్ల గిరిజనుల జీవన విధానంలో మంచి మార్పులు వస్తాయని భావిస్తున్నాం. ప్రకృతిని ప్రేమించాలి. భావితరాలకు బహుమతిగా ఇవ్వాలనేది సంకల్పం. దీనికి కట్టుబడి పని చేస్తాం. ప్రజలు తమవంతుగా సహకరించాలని’ పవన్ కల్యాణ్ కోరారు.
ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ విధానం: నాగబాబు
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్‌కల్యాణ్ విధానమని చెప్పారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, అభివృద్ధికి బాటలు వేయడమే పవన్ ఆలోచనా విధానమని తెలిపారు. పట్టణాలకు గ్రీన్ లంగ్స్‌గా నగరవనాలు ఉండాలని ఆకాంక్షించారు. విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పలువురు ఎమ్మెల్యేలు వర్చువల్‌గా పాల్గొనగా, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌దండే, సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, అదనపు పీసీసీఎఫ్ రాహుల్‌పాండే, ఏపీగ్రీన్ సీఈవో మూర్తి, ఎకో టూరిజం ఈడీ నందిని సలారియా పాల్గొన్నారు.
మారేడుమిల్లిలో మరో ఆకర్షణ..
అరోమా కెనపీ ట్రైల్
మారేడుమిల్లి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏపీ ఫారెస్ట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఎపీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో నిర్మించిన అరోమా కెనపీ ట్రైల్‌ను మంగళవారం ప్రారంభించారు. అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. అటవీ ప్రాంతంలోని చెట్ల పందిరి, పచ్చదనం, సహజ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందర్శకులు నడిచేలా కెనపీ ట్రైల్‌ను రూపొందించారు. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో దీని నిర్మాణం మరింత ప్రత్యేక సంతరించుకుంది!.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!