Share News

ఏవియేషన్‌ హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:30 AM

ఏవియేషన్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఏవియేషన్‌ హబ్‌గా ఏపీ

  • ఎకోసిస్టం అభివృద్ధికి చర్యలు.. కర్నూలు కేంద్రంగా డ్రోన్‌ సిటీ

  • అమరావతి, నెల్లూరు, శ్రీకాకుళం, కుప్పంలో ఎయిర్‌పోర్టులు: కేంద్ర మంత్రి

  • రాష్ట్రంలోనే తొలి ఏవియేషన్‌ అకాడమీ

  • ఓర్వకల్లులో ప్రారంభించిన రామ్మోహన్‌

కర్నూలు/కడప, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఏవియేషన్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ విస్తరణకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌టీవోల సంఖ్య పెంచడంతోపాటు శిక్షణ ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలు జిల్లాలో ఏవియేషన్‌, డ్రోన్‌ రంగాలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణమే కాకుండా శిక్షణ, నిర్వహణ రంగాల్లో ఏవియేషన్‌ ఎకోసిస్టం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలి డీజీసీఏ ఆమోదిత ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌టీవో)ను ఓర్వకల్లు విమానాశ్రయంలో ఓరియంట్‌ ఫ్లైట్‌ ఏవియేషన్‌ అకాడమీ(ఓఎఫ్ఏఏ) ఏర్పాటు చేసింది.

ఈ అకాడమిని రామ్మోహన్‌నాయుడు శనివారం ప్రారంభించారు. 2014 నాటికి దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ప్రస్తుతం 166కు చేరాయని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు సమీపంలో ఉండడం వల్ల కర్నూలు ఏవియేషన్‌ త్వరలోనే దేశంలోనే నంబర్‌ వన్‌గా మారుతుందని చెప్పారు. ఈ ఎఫ్‌టీవోలో ప్రస్తుతం మూడు విమానాలు ఉన్నాయని, త్వరలో ఆ సంఖ్య పదికి చేరుతుందన్నారు. ఎఫ్‌టీవో ద్వారా ఏటా 60 మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఉందని, ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, గ్రౌండ్‌ ఆపరేషన్‌, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని వివరించారు. కర్నూలు కేంద్రంగా డ్రోన్‌ సిటీ ఏర్పాటు ఒక విప్లవాత్మక నిర్ణయమన్నారు. విజయవాడ, కడప, రాజమండ్రి విమానాశ్రయాల్లో కొత్తగా టెర్మినల్‌ భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. కుప్పం, నెల్లూరు, శ్రీకాకుళం, అమరావతి, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటుకు శరవేగంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.


కడప విమానాశ్రయం మరింత అభివృద్ధి

కడప విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రాంతీయ విమానయానాన్ని వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో నూతన టెర్మినల్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా సుమారు రూ.266 కోట్ల బడ్జెట్‌తో మోడరన్‌ టెర్మినల్‌ బిల్డింగును నిర్మిస్తున్నట్టు చెప్పారు. కడప నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

నాడు ఏం జరిగిందంటే..

రాష్ట్ర విభజన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు ఓర్వకల్లు కేంద్రంగా 3వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నా.. విమానయాన సౌకర్యం లేకపోవడంతో పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని గుర్తించిన చంద్రబాబు 1,010 ఎకరాల విస్తీర్ణంలో రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ వినానాశ్రయం నిర్మాణానికి 2017 జూన్‌లో భూమి పూజ చేశారు. ఏడాదిన్నరలో పూర్తి చేసి 2019 జనవరి 8న జాతికి అంకితంచేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ పరిధిలో 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఎఫ్‌టీవోను ఓరియంట్‌ ఫ్లైట్‌ ఏవియేషన్‌ అకాడమీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆ సంస్థ స్థాపించిన తొలి అకాడమీ ఇది. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:30 AM