మద్యం షాపుల షిఫ్టింగ్‌కు మామూళ్లు
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:21 AM
మద్యం షాపులను ఒకచోట నుంచి మరొకచోటకు మార్చుకునే ఫైళ్లు పెట్టేందుకు కొందరు ఉద్యోగులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కమిషనరేట్‌లో కొందరిపై ఆరోపణలు
చర్యలు చేపట్టిన కమిషనర్
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపులను ఒకచోట నుంచి మరొకచోటకు మార్చుకునే ఫైళ్లు పెట్టేందుకు కొందరు ఉద్యోగులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ కమిషనరేట్‌లోనే సంబంధిత సెక్షన్ ఉద్యోగులు ఈ మేరకు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదు అందడంతో తాజాగా ఆ సబ్జెక్టు చూస్తున్న ఉద్యోగుల సెక్షన్ మార్చారు. ఇటీవల అనేక మద్యం షాపుల షిఫ్టింగ్‌కు అనుమతులిచ్చారు. అయితే షిఫ్టింగ్ ఫైలు ముందుకు కదలాలంటే మాకేంటి..? అంటూ కొందరు నగదు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో షాపు షిఫ్టింగ్‌కు రూ.50వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ మొత్తాన్ని రూ.75వేలకు పెంచడంతో కొందరు లైసెన్సీలు నేరుగా కమిషనర్‌కే ఫిర్యాదు చేశారు. ఇకపై షిఫ్టింగ్ ఫైళ్ల కోసం ఎవరూ కమిషనరేట్‌కు రావొద్దని ఆదేశించినట్లు తెలిసింది. శాఖకు సంబంధించిన కొందరు జిల్లాల అధికారులు కూడా తరచూ కమిషనరేట్, సచివాలయంలో కనిపిస్తుండటంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి ఎవరూ అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లకూడదని ఇటీవల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఆదేశాలు జారీచేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు