Share News

సమాయత్తం కండి

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:37 AM

‘సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టండి. రౌడీషీటర్లు, ఘర్షణలకు పాల్పడే వారిని ముందుగానే కట్టడి చేయండి’ అని డీజీపీ హరీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

సమాయత్తం కండి

  • సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచండి

  • నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి

  • అక్రమ ఆయుధాల రవాణా పట్ల మరింత అప్రమత్తత

  • సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలి

  • పోలింగ్‌ అనంతరం కూడా అప్రమత్తత అవసరం

  • సీమ రేంజ్‌ అధికారులతో డీజీపీ సమీక్ష

  • ఎనిమిది జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టండి. రౌడీషీటర్లు, ఘర్షణలకు పాల్పడే వారిని ముందుగానే కట్టడి చేయండి’ అని డీజీపీ హరీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలంటూ పోలీసు యంత్రాంగానికి డీజీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం రాయలసీమ రేంజ్‌ పరిధిలోని ఎనిమిది జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.


‘ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం పంపిణీని అడ్డుకోండి. అక్రమ ఆయుధాల రవాణాపట్ల అప్రమత్తంగా ఉండండి. సోషల్‌ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ఠమైన భద్రతా వ్యూహంతో సిద్ధం కావాలి. సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. గతంలో ఘర్షణలకు పాల్పడినవారు, రౌడీషీటర్లపై చట్టపరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు, గ్రామసభలు, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించాలి. నేరస్థులు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పీడీ యాక్ట్‌లు, జిల్లా బహిష్కరణ వంటి చర్యలు చేపట్టాలి. అంతర్‌ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్ఠం చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలి. డ్రోన్లు, సీసీ కెమెరాలు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.

పోలింగ్‌ అనంతరం కూడా శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి గ్రామం, వార్డుపై సమగ్ర అవగాహనతో పనిచేస్తూ ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాలి’ అని చెప్పారు. సమావేశంలో అదనపు డీజీపీ మధుసూదన రెడ్డి(శాంతిభద్రతలు), అనంతపురం రేంజ్‌ ఐజీ డాక్టర్‌ షీమోషీ బాజ్‌పాయ్‌, కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, డీఐజీ విక్రాంత్‌ పాటిల్‌, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:37 AM