అమరావతి ఓఆర్‌ఆర్‌కు చేయూతనివ్వండి
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:02 AM
సీఎం ఢిల్లీలో గురువారం ఉదయం నుంచి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్...
పోలవరం వద్ద ఐకానిక్ వంతెన చేపట్టండి
కేంద్ర మంత్రులు పాటిల్, అమిత్‌షా, గడ్కరీ, గోయల్, సోనోవాల్‌కు సీఎం వినతులు
సీఎం ఢిల్లీలో గురువారం ఉదయం నుంచి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రోడ్డురవాణా-హైవేల మంత్రి నితిన్ గడ్కరీతోను.. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర నౌకాయాన మంత్రి సర్బానంద్ సోనోవాల్‌తోను సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై అమిత్ షాతో చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీలో చర్చించిన గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చొరవ తీసుకోవాలని ఆయన్ను కోరారు.
పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఆ భూములు కీలకం..
ఏపీలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్థిని మరింత వేగవంతం చేసేదుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)’ అధీనంలోని 20,378 వేల ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని పీయూష్ గోయల్‌ను సీఎం కోరారు. సీఐఐ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక వసతుల అభివృద్థికి ఉప్పు భూములను వినియోగించుకునేందుకు అనుమతించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వాణిజ్య పంటలకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకరించాలని కోరారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని గడ్కరీని సీఎం కోరారు. ఏపీలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్ర తీర ప్రాంత అభివృద్థి, కనెక్టివిటీ పెంచేందుకు బీచ్ రోడ్డు ప్రాజెక్టుపైనా దృష్టి సారించండి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను కలిపేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి.. ప్రాజెక్టుకు అనుబంధంగా రహదారి, వంతెనల నిర్మాణానికి సహకరించండి’ అని కోరారు. సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సహకరించాలని సోనోవాల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో ప్రతిష్ఠాత్మక షిప్ బిల్డింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు అవసరమైన టెర్మినల్, అనుబంధ మౌలిక వసతుల అభివృద్థికి సహకారం అందించాలని కోరారు. ఈ పోర్టును సరకు రవాణా కేంద్రంగానే కాకుండా పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఎగుమతులు, సముద్ర ఆధారిత తయారీ రంగాలకు కీలక హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. నౌకానిర్మాణంతో పాటు మరమ్మతులు, నిర్వహణ, మెరైన్ పరికరాల తయారీకి అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని తెలిపారు. అవసరమైన భూమి, మౌలిక వసతులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు