34 శాతం కన్నా ఎక్కువే ఇస్తాం
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:59 AM
జనాభాలో 50 శాతం కన్నా అధికంగా వెనుకబడిన తరగతులవారు ఉన్నారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రాతినిధ్యం పెంచాలని భావించాం. కానీ గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ...
స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు సీట్లు
బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు
అందుకే కోర్టుకెళ్లి రిజర్వేషన్లు అడ్డ్డుకుంది
అయినా టీడీపీ కట్టుబడి ఉంది
వైసీపీ పాలనను ఓసారి గుర్తుచేసుకోండి
అప్పట్లో ఎటుచూసినా విధ్వంసమే
భూ వివాదాలు, ఆక్రమణలు, దందాలు..
అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు
ప్రతి రైతు సమస్య పరిష్కారమే మా లక్ష్యం
రాజముద్రతో 40 లక్షల పాస్‌పుస్తకాలిచ్చాం
వచ్చే మార్చినాటికి మరో 51.91 లక్షలు
వచ్చే రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ప్రకాశం జిల్లా సభలో సీఎం చంద్రబాబు
జనాభాలో 50 శాతం కన్నా అధికంగా వెనుకబడిన తరగతులవారు ఉన్నారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రాతినిధ్యం పెంచాలని భావించాం. కానీ గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే అక్కడ ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. అయినా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 34 శాతం కన్నా ఎక్కువ సీట్లు ఇస్తాం.
- ప్రకాశం జిల్లా నర్సింగోలు సభలో సీఎం చంద్రబాబు
ఒంగోలు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కన్నా అధికంగానే సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వారందరినీ గెలిపించుకుని తీరుతామని ఉద్ఘాటించారు. గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నా సరే బీసీల ప్రాతినిధ్యం పెంచేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మీభూమి-మీహక్కు కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన రైతులు, మహిళలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పుపై సభలో చంద్రబాబు స్పందించారు. సామాజికంగా, ఆర్థికంగా బీసీలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనే అన్నారు. ఎన్టీఆర్ పాలనలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే, తాను వచ్చాక 34 శాతం చేశానని, గత వైసీపీ ప్రభుత్వం దానిని 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. వైసీపీ నిర్వాకంతో 16,800 పదవులు బీసీలు కోల్పోయారన్నారు. తిరిగి కూటమి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లను నిర్ణయిస్తే, దానిని వ్యతిరేకిస్తూ గొడ్డలి పార్టీ వాళ్లు కోర్టుకు వెళ్లారని అన్నారు. తొలి నుంచి గొడ్డలి పార్టీకి బీసీలంటే వ్యతిరేకత, చిన్నచూపే ఉందని విమర్శించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు 34 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయని, అయితే అంతకన్నా అధికంగానే పార్టీ పరంగా బీసీలకు సీట్లుఇచ్చి గెలిపిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలంటే గొడ్డలి పార్టీకి వెన్నులో వణుకు పుడుతోందని, ఎన్నికల్లో ఓటమి చెందాక గ్రామాల్లో వారి కార్యకర్తలు బయటకురారని భయపడుతూ ఎలాగోలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ‘సర్’ను ఒకవైపు వ్యతిరేకిస్తూ మరోవైపు అది పూర్తయ్యాక ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లి రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారని చంద్రబాబు విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లోనూ ఆశీర్వదించండి:
నీటి సౌకర్యంతో అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు.. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తీసుకురావడం వల్ల శ్రీశైలం నుంచి వెలిగొండకు నీరివ్వగలిగామని వివరించారు. గోదావరి-కావేరి అనుసంధానర చేస్తే ఐదు రాష్ట్రాలు, ఐదు జీవనదులు అనుసంధానమై అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రధాని మోదీతోనూ ఈ విషయంపై చర్చించానని చెప్పారు. వెలిగొండ రెండోదశను కూడా రెండేళ్లలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు, సంపద వృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ‘మంచి పని చేసేవారిని గుర్తిస్తే మంచి జరుగుతుంది. ఓసారి గత వైసీపీ పాలనను గుర్తుచేసుకోండి. అప్పట్లో ఎవరి మొహంలో నవ్వు అన్నది లేదు. ఇంట్లో, బయట కూడా భద్రత లేదు. ఎటుచూసిన విధ్వంసమే సాగింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాష్ట్రానికి రాకూడదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అపూర్వ విజయం అందించినట్లు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు ఆశీర్వదించండి’ అని కోరారు.
పొలం వెళ్లాలే కానీ ఆఫీసుల చుట్టూ కాదు
‘గత ప్రభుత్వ హయాంలో ఎటుచూసినా భూవివాదాలు, ఆక్రమణలు, దందాలు సాగాయి. రీసర్వే పేరుతో అస్తవ్యస్తం చేశారు. రైతుల భూములపై నాయకుడి ఫొటో వేసుకొని పాసుపుస్తకాలు ఇచ్చారు. పొలంలో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకొని రైతులకు అభద్రత కలిగేలా చేశారు. గిట్టనివారివి, తమకు డబ్బులివ్వనివారికి చెందిన భూములను 22(ఏ)లో పెట్టించి వేధించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటన్నింటిని గుర్తించి ప్రతి రైతు సమస్యనూ పరిష్కారం చేయడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నాం. రైతు హలం పట్టి పొలం వెళ్లాలే కానీ అర్జీ పట్టుకొని ఆఫీసులు చుట్టూ తిరిగే అవసరం రాకూడదు. అందుకోసం భూముల సర్వేలో జరిగిన అవకతవకలు, తప్పిదాలు సరిచేస్తూ రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను మీభూమి- మీహక్కు కార్యక్రమంలో ఇస్తున్నాం. ఇప్పటి వరకు 40.58 లక్షల పాసుపుస్తకాలు ఇచ్చాం. మార్చి ఆఖరులోపు మరో 51.91 లక్షలు ఇవ్వనున్నాం. నవంబరులో 10.95 లక్షలు, డిసెంబరులో 9.90 లక్షలు, జనవరిలో 9.0 లక్షలు, ఫిబ్రవరిలో 7.70 లక్షలు, మార్చిలో 12.30లక్షల పాసుపుస్తకాలు ఇస్తాం. ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా ఉండే సాంకేతికత, క్యూఆర్ కోడ్‌లతో రాజముద్రతో ఇస్తున్నాం’ అని అన్నారు.
22(ఏ) నుంచి 16.48 లక్షల ఎకరాలకు విముక్తి
‘రైతులకు భూతంగా తయారైన 22(ఏ)నుంచి సుమారు 16.48లక్షల ఎకరాల భూమికి విముక్తి కలిగించాం. రాష్ట్రంలో 244 ప్రధాన భూ సమస్యలను పరిష్కరించాం. సుమారు 41వేల ఎకరాల భూమికి విముకి కల్పించి హక్కుదారులుగా పాసుపుస్తకాలు ఇచ్చాం. ప్రకాశం జిల్లాలో గర్భకండ్రిక భూములకు విముక్తి కలిగించాం. నా అనుభవం, పవన్ కల్యాణ్ తపన, మోదీ అండతో రాష్ట్రాభివృద్ధి లక్ష్యంతో ఎన్‌డీఏ ఏర్పడగా ప్రజలు ఆదరించారు. గత ప్రభుత్వంలో ఎటుచూసినా విధ్వంసాలు, దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి లేదు. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్ట్టెక్కించేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్‌గా దూసుకుపోతున్నాయి. వచ్చే రెండేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో సాగుతున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం’ అని చంద్రబాబు అన్నారు.
1995 నాటి సీఎంలా స్పీడ్ పెంచా
‘2014 నాటి సీఎంగా కాకుండా 1995 నాటి సీఎంగా ఈసారి స్పీడ్ పెంచాను. గురువారం ఢిల్లీలో ప్రధానితో పాటు ఎనిమిది మంది కేంద్రమంత్రులను కలిసి చర్చించాను. అమరావతి వచ్చాక రాత్రి మళ్లీ విశాఖ పెట్టుబడులపై సమీక్ష చేశాను. అర్ధరాత్రి ఒకటిన్నరకు నిద్రపోయాను. తిరిగి ఉదయం నర్సింగోలు వచ్చాను. ఇదంతా ప్రజల సమస్యల పరిష్కారానికి, సంపద పెంచేందుకే కష్టపడుతున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అలాగే కష్టపడాలి. నీతివంతంగా ప్రజలకు పనిచేయాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బద్ధకంగా ఉండే వారిని ఉపేక్షించను’ అని చంద్రబాబు అన్నారు. పేదవారిని కూడా కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
పాసుపుస్తకాల పంపిణీ.. శంకుస్థాపనలు
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని ఎనిమిది గ్రామాలకు చెందిన 2,915 ఎకరాలకు గర్భకండ్రిక(ఇనాం పోరంబోకు) నుంచి విముక్తి కల్పిస్తూ, అందుకు సంబంధించిన 1,301 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను చంద్రబాబు అందించారు. ఒక్క నర్శింగోలులోనే అలాంటి రైతులు 209మంది ఉన్నారు. నర్సింగోలుకు చెందిన కోటేశ్వరరావు, రామచంద్రాపురానికి చెందిన బాలమ్మకు స్వయంగా సీఎం పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. కొండపి నియోజకవర్గంలో రూ.166.40 కోట్లతో చేపడుతున్న పాలేరు రిజర్వాయర్ స్పిల్‌వే పనులు, పాలేరుపై రూ.28 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. 200 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు, మహిళలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.
చట్టబద్ధ సమస్యలున్నా బీసీలకు న్యాయం
34 శాతం కంటే ఎక్కువే ఇద్దాం!.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
బీసీల రాజకీయ సాధికారతకు చట్టబద్ధమైన, నిలకడైన పరిష్కారాన్ని కనుగొనడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చట్టబద్ధ సమస్యలున్నా రాజకీయంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న వెంటనే సుప్రీంకోర్టు తీర్పు, అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు శనివారం అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. రాజీవ్ రంజన్ ఏకసభ్య కమిషన్ నివేదికను క్యాబినెట్ ముందుంచి, ఆమోదం తీసుకోనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు