Share News

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాము: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:19 PM

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు.

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాము: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu on Amaravati Quantum Valley

అమరావతి: ఏపీని సాంకేతికంగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపే దిశగా నేడు(శనివారం) కీలక అడుగు పడింది. రాజధానిలోని ఉద్దండరాయుని పాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు భారతదేశానికీ ఇదొక చరిత్రాత్మక దినమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ క్వాంటం వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయటం లేదని, గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్‌లో భాగమయ్యే నిపుణులకు కూడా పునాది వేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్‌గా నిలిచిపోతుందని భావిస్తున్నానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఓ కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చుకోలేక పోయిందని అన్నారు. కానీ ఐటీ విప్లవంలో దేశం ముందడుగు వేసిందని చెప్పారు.


గతంలో హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించామని గుర్తు చేశారు. అది ఓ గేమ్ ఛేంజర్‌గా మారి ఫలితాలను ఇస్తోందన్నారు. హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని చెప్పారు. భారత్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారన్నారు. ఇది కూడా ఓ విప్లవంగా మారుతుందని అన్నారు. సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీఎస్ఎన్‌ఎల్ 4జీ స్టాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ సాంకేతికత ద్వారా 6జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యం అవుతుందని అన్నారు. ఇదే తరహాలో భారత్ నుంచి వేర్వేరు ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

గతంలో ఐటీ గురించి, సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే తనను విమర్శించిన వారి పిల్లలు ఇప్పుడంతా ఐటీ రంగంలో అమెరికాలో స్థిరపడ్డారని అన్నారు. వచ్చే 30 -40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపై తానెప్పుడూ ఆలోచన చేస్తానని చంద్రబాబు అన్నారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. టెక్నాలజీని అందిప్చుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధించగలుగుతుందని అన్నారు.

క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా ఏపీ మారుతుందనీ సీఎం చంద్రబాబు చెప్పారు. క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్‌కు అమరావతి కేంద్రం అవుతుందని చెప్పారు. డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ, ఫైనాన్స్, క్లైమేట్ మోడలింగ్ కు అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయని అన్నారు. ఇప్పటి వరకూ అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారని, ఇక నుంచి అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారని చెప్పారు.

క్వాంటం టెక్నాలజీ కోర్స్ కోసం ఇప్పటికే 66వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో 50శాతం కేవలం ఏపీకి చెందిన వారేనని చెప్పారు. కుప్పానికి చెందిన ఓ స్టూడెండ్ బ్లడ్ ప్లజర్, పల్స్ చూసే యాప్‌ను కనిపెట్టాడని తెలిపారు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎన్నో సాధించాలని పిలుపునిచ్చారు.

ఏపీలోని స్టూడెంట్స్ ఏఐని అడాప్ట్ చేసుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి. క్వాంటం ఆల్గరిథమ్‌లు రాయాలని సూచించారు. అప్పుడే విద్యార్థులు గేమ్ ఛేంజర్లుగా మారుతారని చెప్పారు. ఇప్పటికే స్పెస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమికండెక్టర్ సిటీ, మెడ్ టెక్ వంటివి ప్రారంభించామని వివరించారు. తిరుపతిలో స్పేస్ సిటీకి రావాలని కేంద్ర మంత్రిని కోరుతున్నానని అన్నారు. అక్కడి నుంచి త్వరలోనే శాటిలైట్లు లాంచ్ చేసే రోజూ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి ఇక్కడున్న రైతులే ప్రధాన భాగస్వాములని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతి తయారవుతుందని అన్నారు. ప్రపంచశ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా అమరావతి మారుతుందని చెప్పారు. భారత్‌లోని మొదటి 133-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని అన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 07:51 PM