Share News

‘రీ సర్వే’పై నిరంతర సమీక్ష!

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:19 AM

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియపై జాయింట్‌ కలెక్టర్లు ప్రతి రోజూ, కలెక్టర్లు వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌ లేదా టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు.

‘రీ సర్వే’పై నిరంతర సమీక్ష!

  • జేసీలు ప్రతి రోజూ, కలెక్టర్లు వారానికోసారి క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడాలి

  • భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

  • నిర్దేశిత గడువులోగా గృహనిర్మాణ లక్ష్యాలు పూర్తి

  • అన్ని జిల్లాల్లో ‘సంజీవని’ అమలుకు ఏర్పాట్లు

  • ఎల్‌నినో దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

  • 17లోగా పంట నష్టం అంచనాలు పూర్తిచేయాలి

  • వివిధ శాఖలపై సమీక్షలో సీఎస్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియపై జాయింట్‌ కలెక్టర్లు ప్రతి రోజూ, కలెక్టర్లు వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌ లేదా టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్షించారు. సీఎస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రీసర్వే ప్రగతిలో వెనుకబడిన మండలాల అధికారులతో జేసీలు, కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. ‘సంజీవని’ ఆరోగ్య సేవల అమలుకు జిల్లాలన్నీ సన్నద్ధం కావాలని ఆదేశించారు. ‘ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యసేవలు అందేలా మౌలిక వసతులు, ఐటీ పరికరాలు, వర్చువల్‌ వైద్య సంప్రదింపుల గదులు ఏర్పాటు చేయాలి. పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్ల నియామకం, వైద్య సిబ్బందికి శిక్షణ, ఆరోగ్య కేంద్రాల నమోదు ప్రక్రియలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు ప్రతి వారం పురోగతిని సమీక్షించాలి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నియంత్రణతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలి’ అని ఆదేశించారు.


ఇళ్ల నిర్మాణాలు వేగవంతం

గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎస్‌ స్పష్టం చేశారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్లు నిరంతరం సమీక్షించాలని, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చూడాలని సూచించారు. పీఎం ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ 2.0 కింద ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించాలని సూచించారు. అవసరమైన చోట ప్రైవేట్‌ భూముల సేకరణకు ప్రతిపాదనలు తయారు చేసి, ఈ నెల 17లోగా భూసేకరణ బడ్జెట్‌ అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.

మంచి నీటిని మళ్లించనీయొద్దు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడిన దృష్ట్యా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సీఎస్‌ సాయిప్రసాద్‌ స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. మంచి నీటి వనరులను తాగునీటికి తప్ప, ఇతర అవసరాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి చౌర్యానికి పాల్పడితే.. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయించాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని, ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని ఆయన నిర్దేశించారు.


కరువు ప్రాంతాల్లో పంటల స్థితిని పర్యవేక్షించాలి

రాష్ట్రంలో ప్రస్తుతం 38.9 శాతం వర్షపాత లోటుతో 21 జిల్లాల్లో 388 కరువు మండలాలు ప్రకటించిన నేపథ్యంలో పంట నష్టం అంచనాలను ఈ నెల 17లోగా పూర్తిచేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన పంటల పరిరక్షణకు సూక్ష్మసేద్యం, పంట కుంటలు, మల్చింగ్‌ వంటివి ప్రోత్సహించాలని సూచించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటల స్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ సంస్కరణలను వేగవంతం చేయాలి

నిబంధనల సరళీకరణ, రూల్స్‌ అనుసరణ భారాల తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్‌ సాయిప్రసాద్‌, కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి సందీప్‌ పాండ్రిక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెండో దశ నిబంధనల భారాన్ని తగ్గించడం, నియంత్రణల సడలింపుపై సమీక్ష నిర్వహించారు. విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, లీగల్‌ మెట్రాలజీ శాఖల పురోగతి, పెం డింగ్‌ అనుమతులు, సవరణలు, ఉత్తర్వుల జారీ అంశాలపై చర్చించారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఎన్‌వోసీలు, లీగల్‌ మెట్రాలజీలో రిజిస్ర్టేషన్లు, విద్యాసంస్థలకు గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:19 AM