జడ్పీటీసీలను ‘కాసు’కునేదెవరు?
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:33 AM
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గ్రామ సర్పంచ్ ఎన్నికలకే లక్షల రూపాయలు వదిలించుకోవలసి వస్తుంది. అలాంటిది జడ్పీటీసీ ఎన్నికలంటే వ్యయం జాస్తిగానే ఉంటుంది. సాధారణంగా జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికల్లో జడ్పీటీసీల ఎన్నికల ఖర్చులో అధిక మొత్తం జడ్పీ చైర్మన్ అభ్యర్థి పెట్టుకుంటుంటారు.
ఖర్చులకు డబ్బుల్లేక అభ్యర్థులు విలవిల
జడ్పీటీసీల ఎన్నికల వ్యయాన్ని పట్టించుకోని నేతలు
ఇంకా ఖరారు కాని కూటమి చైర్మన్ అభ్యర్థులు
చేతులెత్తేస్తున్న ఎమ్మెల్యేలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గ్రామ సర్పంచ్ ఎన్నికలకే లక్షల రూపాయలు వదిలించుకోవలసి వస్తుంది. అలాంటిది జడ్పీటీసీ ఎన్నికలంటే వ్యయం జాస్తిగానే ఉంటుంది. సాధారణంగా జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికల్లో జడ్పీటీసీల ఎన్నికల ఖర్చులో అధిక మొత్తం జడ్పీ చైర్మన్ అభ్యర్థి పెట్టుకుంటుంటారు. కానీ ఈసారి చిత్రమైన పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల నడుమ సర్దుబాటు లెక్కలు తేలకపోవడంతో రాష్ట్రంలోని అధికశాతం సీట్లలో చైర్పర్సన్ అభ్యర్థులు ఖరారు కాలేదు. దీంతో జడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులను ‘కాసు’కునే వారు కరువయ్యారు.
రాష్ట్రంలో 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 28 జిల్లాల ప్రాతిపదికన సగటున ఒక్కో జిల్లాకు 20 నుంచి 25 వరకు జడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. అత్యధికంగా కడప జిల్లా పరిషత్ పరిధిలో 39 జడ్పీటీసీ స్థానాలు ఉండగా అత్యల్పంగా విశాఖపట్నం జడ్పీలో కేవలం నాలుగే ఉన్నాయి. ఒక్కో జడ్పీటీసీ పరిధిలో సగటున 50వేల ఓటర్లు ఉంటారు. విజయవాడ రూరల్ జడ్పీటీసీలో సుమారు లక్షన్నర మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన జడ్పీటీసీ ఎన్నికల ఖర్చు బాగానే ఉంటుంది. మొత్తం జడ్పీటీసీల్లో 50 శాతం స్థానాలు రిజర్వేషన్లలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈసారి సోషల్ రీ-ఇంజనీరింగ్ పేరుతో టీడీపీ బీసీ, ఎస్సీలకు ఎక్కువ స్థానాలు కేటాయించింది. జనరల్ స్థానాల్లో సైతం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టికెట్లు దక్కించుకున్న చాలా మంది అభ్యర్థులు ఆర్థిక దన్ను లేక, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు.
చైర్మన్‌గిరీ వస్తుందో రాదో..
సాధారణంగా జడ్పీటీసీ ఎన్నికల ప్రారంభంలోనే జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది రాజకీయ పార్టీలు ఖరారు చేయడం ఆనవాయితీ. దీంతో చైర్పర్సన్ అభ్యర్థి.. జడ్పీటీసీల ఎన్నికల ఖర్చును భరించేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. చాలా జడ్పీల్లో చైర్మన్ సీటు కోసం భారీ పోటీ నెలకొంది. అలాగని వారంతా జడ్పీటీసీల ఎన్నికల ఖర్చును భరిస్తున్నారా అంటే అదీ లేదు. చైర్మన్ సీటుకు గ్యారెంటీ లేకుండా తామెలా ఖర్చు పెడతామని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేల వైపు చూపు..
చాలా జిల్లాల్లో జడ్పీటీసీ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు కోసం ఎమ్మెల్యేల వైపు చూస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం కూడా జడ్పీటీసీల గెలుపు బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వానిదేనని చెబుతుండడంతో ఎమ్మెల్యేలు తమను ఆదుకుంటారని ఎదురు చూస్తున్న జడ్పీటీసీలకు నిరాశే మిగులుతోంది. కొందరు ఎమ్మెల్యేలు తెలివిగా జడ్పీటీసీల ఎంపికలోనే అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తమపై భారం పడకుండా చూసుకున్నారు. అయితే అత్యధిక అభ్యర్థులు సామాన్య కుటుంబాల నేపథ్యం ఉన్నవారే. కనీసం ఇలాంటి వారి విషయంలోనైనా కూటమి పార్టీల అధిష్ఠానాలు దృష్టి పెట్టాలని.. లేకుంటే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్