Share News

రూ.13,500 కోట్లతో మూలపేటలో భారీ యూరియా ప్లాంట్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:21 AM

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పారిశ్రామిక పెట్టుబడి రానుంది. ఎరువుల దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా బృహత్తర ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది.

రూ.13,500 కోట్లతో మూలపేటలో భారీ యూరియా ప్లాంట్‌

  • కేంద్ర సంస్థలు గెయిల్‌, క్రిబ్కో భాగస్వామ్యం

  • ఏటా 1.27 మిలియన్‌ టన్నుల ఉత్పాదన

  • ఏపీఈడీబీతో త్వరలోనే ఎంవోయూ!

న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పారిశ్రామిక పెట్టుబడి రానుంది. ఎరువుల దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా బృహత్తర ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ‘గెయిల్‌’, ‘క్రిబ్కో’ కలిసి.. విడతలవారీగా సుమారు రూ.13,500కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేట కేంద్రంగా 1.27 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో (ఎంఎంటీపీఏ) యూరియా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ)తో త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. దీని ద్వారా దాదాపు 300-400 మందికి ప్రత్యక్షంగా.. వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించనుంది. నామమాత్రపు ధరకే భూమిని కేటాయించడంతోపాటు ప్రాజెక్టు ప్రాంతం వరకు రోడ్లు, విద్యుత్‌, నీరు, రైల్వే కనెక్టివిటీ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను ఉచితంగా సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 700 ఎకరాల భూమి అవసరం. కాగా, పశ్చిమాసియాలో యుద్థం కారణంగా ఎరువుల కొరత తీవ్రమైన నేపథ్యంలో.. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి కేంద్రం ఇటీవల ‘నేషనల్‌ ఇన్వె్‌సమెంట్‌ పాలసీ ఫర్‌ యూరియా-2026’కు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే మూలపాడులో గెయిల్‌, క్రిబ్‌కో యూరియా ప్లాంట్‌ నిర్మాణం తలపెట్టడం గమనార్హం.

Updated Date - Nov 12 , 2026 | 06:24 AM