ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి కారణాలు పలు ప్రమాదాలకు కారణంగా ప్రాథమికంగా వెల్లడవుతున్నాయి.
ఎన్టీఆర్, సెప్టెంబర్ 20: జిల్లాలోని నందిగామ మండలం అంబారుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. హోటల్‌లో పనిచేస్తున్న మహిళ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అంబారుపేట వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాధితురాలిని అంబారుపేటకు చెందిన కవితగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరికుంటపాడు మండలం రామాపురం వద్ద ఓమిని, బొలెరో వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వాహనాల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.