అణు విద్యుత్‌కు సై!
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:44 AM
జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తును దాటి... అణు విద్యుత్తు ఉత్పత్తి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ, బొగ్గుపై ఆధారపడే పరిస్థితిని ...
ఎస్‌ఎంఆర్ సాంకేతికతతో ప్లాంట్ల ఏర్పాటు
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రత్యామ్నాయం
కాలుష్యం, బొగ్గు అవసరాలకు చెక్
అనువైన ప్రాంతాల గుర్తింపునకు రెడీ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే నూక్లియర్ ఎనర్జీ మిషన్ ప్రకటించిన కేంద్రం
బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయింపు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తును దాటి... అణు విద్యుత్తు ఉత్పత్తి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ, బొగ్గుపై ఆధారపడే పరిస్థితిని నివారిస్తూ, భవిష్యత్ అవసరాలకు తగిన విద్యుదుత్పత్తి కోసం.. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్‌ఎంఆర్)లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించింది. దీనిపై శుక్రవారం జీవో నంబరు 81 జారీ చేసింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటులో ప్రైవేటు సంస్థలకూ భాగస్వామ్యం కల్పించనుంది. కాలం చెల్లిన థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో, ఇతర అనువైన ప్రాంతాల్లో ఎస్‌ఎంఆర్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
దేశంలో రోజురోజుకీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. విద్యుదుత్పత్తికి ప్రధానంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడుతున్నాం. వీటివల్ల కాలుష్యం ఎక్కువ. బొగ్గు నిల్వలూ తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం 2025-26 బడ్జెట్‌లో నూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద రూ.20వేల కోట్లు కేటాయించింది. 2033 నాటికి స్వదేశీ ఎస్‌ఎంఆర్‌లను అందుబాటులోకి తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం. ఇందులో భాగంగానే ఎస్‌ఎంఆర్‌ల ఏర్పాటు అవకాశాలపై రాష్ట్రం దృష్టి సారించింది
ఏమిటీ ఎస్‌ఎంఆర్ టెక్నాలజీ..
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) టెక్నాలజీ అనేది అణు విద్యుత్ ఉత్పత్తిలో ఆధునిక సాంకేతికత. భారీ అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే వీటి పరిమాణం చిన్నగా ఉంటుంది. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయవచ్చు. ఎస్‌ఎంఆర్ రియాక్టర్లు చిన్నవిగా ఉన్నా 1000 మెగావాట్ల దాకా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎస్‌ఎంఆర్‌లలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వాటంతట అవే చల్లబడి సురక్షితంగా ఆగిపోయే సాంకేతికత ఉంటుంది. భారీ విస్తీర్ణంలో ఏర్పాటై, ఇక ఉత్పత్తి భారమైన థర్మల్ ప్లాంట్ల స్థానంలో ఎస్‌ఎంఆర్‌ల ఏర్పాటు సులువు. అక్కడ ఇప్పటికే ఉన్న విద్యుత్ గ్రిడ్, నీటివనరులు, ఇతర మౌలిక సదుపాయాలను వాడుకొని ఎస్‌ఎంఆర్‌లను ఏర్పాటు చేయవచ్చు.
మన దేశంలో ఉన్నాయా?
ప్రస్తుతం దేశంలో వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఎస్‌ఎంఆర్‌లు ఎక్కడా లేవు. అయితే కేంద్ర అణుశక్తి విభాగం (డీఏఈ), బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బీఆర్‌ఏసీ), న్యూక్లియార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఎల్) సంయుక్తంగా దేశంలో 3 రకాల స్వదేశీ ఎస్‌ఎంఆర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కేంద్రం వీటికి ప్రాథమిక అనుమతులు కూడా ఇచ్చింది.
మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద బీఎ్‌సఎంఆర్ (భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్) పేరుతో ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని సామర్థ్యం 200 మెగావాట్లు.
ఎస్‌ఎంఆర్-55 పేరుతో మరో ఎస్‌ఎంఆర్‌నూ తారాపూర్ వద్దే ఏర్పాటు చేస్తున్నారు. దీని సామర్థ్యం 55 మెగావాట్లు.
విశాఖలో హెచ్‌టీజీసీఆర్ పేరుతో రియాక్టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన హైటెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్డర్ ఇది. విశాఖ బార్క్ క్యాంప్‌సలో ఏర్పాటుకు ప్రతిపాదించారు.