ఆల్మట్టి ఎత్తు పెంపుపై..చంద్రబాబు అభ్యంతరం
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:02 AM
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి డీకే శివకుమార్ అన్నారు.
సీనియర్ నేత ఇలా చేస్తారనుకోలేదు: డీకే శివకుమార్
కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖ రాసింది
ఎత్తు పెంచొద్దని, గెజిట్ చేయొద్దని కోరింది
మా రాష్ట్రంలో భూసేకరణకు ఏపీ
అడ్డు చెప్పడమేంటి: కర్ణాటక డిప్యూటీ సీఎం
బెంగళూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ రాజకీయ నాయకుడని.. ఇలా అభ్యంతరం చెబుతారని అనుకోలేదని తెలిపారు. కృష్ణా జలాలలో వారి వాటా వారికి వెళ్తోందని చెప్పారు. మంగళవారం ఇక్కడి విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక చేపట్టే భూసేకరణ ప్రక్రియను ఏపీ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. కేంద్ర జలశక్తి శాఖకు తన అభ్యంతరంతో సమగ్ర లేఖ పంపిందని.. ఎత్తు పెంపునకు అనుమతులు ఇవ్వొద్దని.. గెజిట్ చేయవద్దని అందులో కోరిందన్నారు. దీనిపై జలశక్తి శాఖ కర్ణాటక స్పందన కోరిందని తెలిపారు. తమ రాష్ట్రంలో భూసేకరణపై అభ్యంతరం చెప్పడం ఏపీ ప్రభుత్వానికి ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కర్ణాటక నుంచి 28 మంది ఎంపీలు ఉన్నారని.. అందరూ సమష్టిగా కేంద్ర జలశక్తి మంత్రిని, ప్రధానమంత్రిని కలసి అనుమతులు సాధించాలని, ఒత్తిడి తీసుకురావాలని కోరతామని తెలిపారు.
రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో నలుగురు మంత్రులు ఉన్నారని, రాష్ట్ర సంక్షేమానికి వారు పాటుపడాలని.. మౌనంగా ఉంటే భావి తరాలకు అన్యాయం చేసినట్లేనని స్పష్టం చేశారు. ‘ఆల్మట్టి ప్రస్తుతం 519.16 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై చర్చించేందుకు గత ఏడాది జూన్ 18న కేంద్ర జలశక్తి శాఖ ఆహ్వానించింది. అయితే ఢిల్లీ వెళ్లేలోగా సమావేశం వాయిదా వేశారు. గతనెల 26న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 1,33,867 ఎకరాలకు పరిహారంగా రూ.70 వేల కోట్లు చెల్లించాలని తీర్మానించాం. రాష్ట్ర బడ్జెట్‌లోనూ కొంత గ్రాంటును కేటాయిస్తున్నాం’ అని శివకుమార్ వివరించారు.