ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇవ్వాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:24 AM
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
నీటి పథకాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం
నిర్వహణ ఖర్చులను రుసుముల ద్వారా రాబట్టు కోవాలి
నీటి సరఫరాలో సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి
నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ నీటి సరఫరా పథకాల నిర్వహణలో బాధ్యత, పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు పెంచడం, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశం. ప్రతి గ్రామంలో 100 శాతం గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉండాలి. ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల నీటిని అందించాలి. నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలి. గ్రామాల అంతర్గత నీటి పంపిణీ వ్యవస్థల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలు, గ్రామ నీరు, పారిశుధ్య కమిటీలు చేపట్టాలి. గ్రామసభ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు నీటి సరఫరా జరగాలి.
ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు స్థానిక మహిళలను గుర్తించి, నీటి నాణ్యత పరీక్షల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. నీటి సరఫరా పథకాల నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని సమాజం నగదు, వస్తు రూపంలో లేదా శ్రమ రూపంలో సమకూర్చాలి. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఎస్సీ/ఎస్టీ జనాభా 50 శాతానికి మించి ఉన్న గ్రామాల్లో 5 శాతం, ఇతర గ్రామాల్లో 10 శాతం సమాజ భాగస్వామ్యం ఉండాలని మార్గదర్శకాలు పేర్కొన్నారు. గ్రామ నీరు, పారిశుధ్య కమిటీలు స్థానిక నీటి వినియోగ రుసుములను నిర్ణయించి, వసూలు చేసి, గ్రామ బ్యాంకు ఖాతాలో నిల్వ చేయాలి. విద్యుత్ బిల్లులు, వాల్వ్‌మెన్ వేతనాలు, చిన్నపాటి మరమ్మతుల వంటి సాధారణ నిర్వహణ ఖర్చులను వినియోగ రుసుముల ద్వారా నూరు శాతం తిరిగి రాబట్టే లక్ష్యంతో పనిచేయాలి. నీటి సరఫరా వ్యవస్థలో తలెత్తే సమస్యలను 24-48 గంటల్లో పరిష్కరించాలి.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్