ఒక గ్రామం.. ఒక నెల
ABN , Publish Date - May 07 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో రైతాంగం, భూ యజమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ స్పష్టమైన కార్యాచరణ రూపొందించింది.
భూ సమస్యల పరిష్కారానికి కొత్త కార్యక్రమం
ప్రజల వద్దకే రెవెన్యూ, ఇతర అధికారులు
ప్రతి గురువారం మండలంలో ఓ గ్రామానికి
నెలలో నాలుగు దఫాలుగా సందర్శన
ఈ నెల నుంచే రాష్ట్రమంతా అమలు
కలెక్టర్లదే పర్యవేక్షణ.. సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతాంగం, భూ యజమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ స్పష్టమైన కార్యాచరణ రూపొందించింది. మండలంలో సగటున ఒక గ్రామంలో ఉన్న భూ సమస్యలను ఒక నెలలో పరిష్కరించేందుకు కొత్త కార్యక్రమం రూపొందించింది. ‘ఒక నెల, ఒక గ్రామం, నాలుగు దఫాలుగా గ్రామ సందర్శన’ పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది డిసెంబరు నుంచి నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల నుంచే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రంలో అనేక రకాల భూ సమస్యలు ఉన్నాయి. ప్రజలు తమ సమస్యలపై నిరంతరం పీజీఆర్‌ఎ్‌సలో ఏకరువు పెడుతున్నారు. వాస్తవానికి వీటికి గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ఓ పట్టాన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆఫీసులో పరిష్కరించాల్సిన సమస్యలను కూడా పెండింగ్‌లో పెడుతూ నిరంతరం రైతులను తిప్పించుకుంటున్నారు. విసిగివేసారిన రైతులు కొందరు రెవెన్యూ ఆఫీసుల ముందే ఆందోళనలు చేస్తున్నారు. అయినా పరిష్కారం కావడం లేదని సహనం కోల్పోయిన రైతులు కొందరు రెవెన్యూ ఆఫీసుల ముందే ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజల వద్దకే పంపించి నెల రోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
నెలలో నాలుగుసార్లు గ్రామానికి
ఒక నెల, ఒక గ్రామం కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్‌తో పాటు ఎంపీడీవో, ఇంకా జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖల ఇంజనీర్లు, అటవీ, దేవదాయ శాఖల అధికారులు బృందంలో సభ్యులుగా ఉంటారు. ఒక నెలలో నాలుగు దఫాలుగా ప్రతి గురువారం అధికారుల బృందం మండలంలో ఓ గ్రామానికి వెళ్తుంది.
తొలి దఫా వెళ్లినప్పుడు ప్రజల భూ సమస్యలను నమోదు చేస్తారు. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు, 22(ఏ) జాబితాలో ఉన్న భూములు, సరిహద్దు తగాదాలు, సర్వే నంబర్లలో లోపాలు, కుటు ంబ సభ్యుల మధ్య పంపకం సమస్యలను నమోదు చేసుకుంటారు.
రెండో దఫా పర్యటనకు వెళ్లినప్పుడు భూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన పిటిషన్ల పురోగతి గురించి తెలియజేస్తారు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తారు.
మూడో దఫా పర్యటనలో రైతులు, భూ యజమానులు ఇచ్చిన పిటిషన్లకు పరిష్కారం చూపుతారు. గ్రామంలో రైతులు, భూ యజమానులు ఇచ్చిన పిటిషన్ల పరిష్కారం పూర్తయిందని తెలియజేస్తూ ఉత్తర్వులు ఇస్తారు. సమస్యల పరిష్కారం అంటే.. రికార్డుల సవరణ, ఈకేవైసీ వంటివి పూర్తిచేస్తారు.
నాలుగో దఫా అంటే చివరి సందర్శనకు వెళ్లినప్పుడు గ్రామంలో సభ నిర్వహిస్తారు. పిటిషన్ల పరిష్కారంపై అధికారులు స్పష్టత ఇస్తారు. పిటిషన్ల స్వీకరణ, పరిష్కారం, వాటిల్లో ఉన్న సమస్యలను ప్రజల సమక్షంలో ఉంచుతారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నవి లేదా కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్నవి మిన హా మిగిలిన పిటిషన్లను పరిష్కారం చేయాలన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ దిశగా పిటిషన్ల పరిష్కారం జరగనుంది.
ఏయే అంశాలకు పరిష్కారం చూపిస్తారంటే..
అధికారులు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. సీసీఎల్‌ఏ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. మ్యుటేషన్ సవరణలు, క్రయ, విక్రయాల ద్వారా జరగాల్సిన మ్యుటేషన్లు, నోషనల్ ఖాతాలను రెగ్యులర్ ఖాతాలుగా మార్చడం, జీరో ఖాతాలను రెగ్యులర్ ఖాతాలుగా మార్చడం, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, రీ సర్వే సమస్యలు, ఎఫ్-లైన్ పిటిషన్లు, సరిహద్దు వివాదాలు, తగాదాలు, పొలం గట్లు, రహదారి వివాదాలు, కుటుంబంలో ఉమ్మడి భూముల్లో ఉన్న వివాదాలు, ఎల్‌పీఎమ్‌లో సర్వే నంబర్ల సవరణ, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అసైన్డ్ భూముల ఆక్రమణ కేసులు, చుక్కల భూముల నిర్ధారణ, మిస్ అయిన సర్వే నంబర్లు వంటి అంశాలను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వక పిటిషన్లు ఇవ్వాలి.
కలెక్టర్ల పర్యవే క్షణ
ఈ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్లు స్వీయపర్యవేక్షణ చేయాలి. గ్రామంలో రైతుల నుంచి తీసుకొనే ప్రతీ పిటిషన్‌ను రికార్డుల్లో ఎక్కించాలి. ఇది వీఆర్‌వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల బాధ్యత. పిటిషన్ల పరిష్కారంపై తహశీల్దార్, సర్వేయర్లు క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలని సీసీఎల్‌ఏ స్పష్టం చేశారు. ఒకవేళ రైతులు ఇచ్చిన పిటిషన్ పరిష్కారమైనట్లు ముగించేస్తే, ఆ విషయాన్ని రైతుకు లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతీ పిటిషన్‌ను విధిగా పీజీఆర్‌ఎస్ పరిధిలోకి తీసుకురావాలి. సబ్‌కలెక్టర్, ఆర్‌డీవోలు ప్రతీ వారం ఒక గ్రామంలోని సమస్యల పురోగతిపై సమీక్ష చేయాలి. కలెక్టర్లు ప్రతి వారం ఈ అంశంపై సమీక్ష చేయాలి. ఈ కార్యక్రమం అమలులో వచ్చే ప్రధాన సమస్యలు, ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతున్న అంశాలను గుర్తించి సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకురావాలి.