నిప్పుల కొలిమి..
ABN , Publish Date - May 21 , 2026 | 05:09 AM
దేశంలో అనేక రాష్ట్రాలు ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం కూడా నిప్పుల కొలిమిలా మారింది.
పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ వేసవి సీజన్‌లో ఇదే అత్యధికం
11 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదు
వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
24 వరకు కొనసాగనున్న వడగాడ్పులు
విశాఖపట్నం, అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): దేశంలో అనేక రాష్ట్రాలు ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం కూడా నిప్పుల కొలిమిలా మారింది. ఈ నెల 24వ తేదీ వరకు అనేక రాష్ట్రాల్లో (ఏపీలో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలు ప్రాంతాలు) వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం రాష్ట్రంలో ఎండ ఠారెత్తించింది. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురంజిల్లా నందనమారెళ్లలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46, బాపట్ల జిల్లా కొల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 45.9, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొండపిలో 45.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 45.5, నెల్లూరు జిల్లా గూడూరులో 45.4, పోలవరం జిల్లా కూనవరంలో 45, గుంటూరు జిల్లా పాండ్రపాడులో 44.8, కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 44.5, అనకాపల్లి జిల్లా మాకవరపాలెలం, తిరుపతి జిల్లా పూలతోటలో 44.4, విశాఖ జిల్లా ములగాడలో 43.6, కాకినాడ జిల్లా కాజులూరులో 43.5, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో అనేక చోట్ల 40 డిగ్రీల మార్కు దాటింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-7 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణాలో 21, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో 20 చొప్పున, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో 15 చొప్పున, మార్కాపురం జిల్లాలో 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. రానున్న నాలుగు రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు
అరేబియా సముద్రం నుంచి కేరళ, కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధవారం అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. గురువారం కూడా రాష్ట్రంలోని 74 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 232 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడూ 70 కి.మీ. వేగంతో బలమైన గాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఎండ దెబ్బకు భీతిల్లుతున్న ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తించడంతో ప్రజలు భీతిల్లారు. భానుడి ప్రతాపానికి వడగాడ్పులు తోడవడంతో విలవిల్లాడారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో చాలాచోట్ల బిజీ రోడ్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు 10 గంటలకే నిర్మానుష్యంగా మారాయి. చాలామంది పగటి పూట ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో బస్సులు, ప్రైవేటు వాహనాలు ఖాళీగా కనిపించాయి. వ్యాపారులు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు షాపులు మూసి ఉంచుతున్నారు.
ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం
కేంద్ర సూచనలతో తుఫాన్లు, వరదలు ఎదుర్కోండి: కేంద్ర జలసంఘం
ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర జలసంఘం దక్షిణాది రాష్ట్రాలను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లను అనుసరిస్తూ, అందులోని సూచనలు పాటిస్తూ.. తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళకు సూచించింది. బుధవారం సీడబ్ల్యూసీ, కేంద్ర వాతావరణ శాఖ, రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో వెబ్‌నార్ విధానంలో సమీక్ష నిర్వహించింది.

ఎండలతో జాగ్రత్త..!
అప్రమత్తంగా ఉండాలి: సత్యకుమార్
రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. బుధవారం సచివాలయంలో ‘ఎండల తీవ్రత - సన్నద్ధత’పై ఆయన సమీక్షించారు. ప్రభుత్వం జారీచేసే హెచ్చరికలు, వైద్యుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వడగాల్పులు, ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని, ఆ సమయంలో బయట తిరగొద్దని చెప్పారు. ఆరోగ్యశాఖ సిబ్బంది వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుని సన్నద్ధంగా ఉండాలన్నారు.
ఏడు రోజులు ప్రత్యేక చర్యలకు మెమో
రాష్ట్రంలో తీవ్ర ఉష్టోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌దండే అధికారులకు మెమో జారీచేశారు.
