Share News

గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:36 AM

రాష్ట్ర విద్యుత్‌ రంగానికి భారీ ఊతమిచ్చే కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ)-3 పథకం కింద విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అనుమతులు మంజూరు చేసింది.

గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

  • రూ.27,370 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

  • రాష్ట్ర విద్యుత్‌ రంగానికి భారీ ఊతం

  • మూడో దశ పథకానికి ఎంపికైన ఏపీ

  • పునరుత్పాదక ఇంధన విద్యుత్తు..

  • జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమే లక్ష్యం

  • సీమకు అధిక లబ్ధి

అమరావతి, న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్‌ రంగానికి భారీ ఊతమిచ్చే కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ)-3 పథకం కింద విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ను(గ్రీన్‌ ఎనర్జీ) ఎక్కడికక్కడ సేకరించి, సంప్రదాయ గ్రిడ్‌పై ఒత్తిడి పడకుండా జాతీయ గ్రిడ్‌కు తరలించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర పరిధిలోని విద్యుత్‌ ప్రసార వ్యవస్థను ఆధునీకరించి, బలోపేతం చేస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.27,370 కోట్లు. ఇందులో 33 శాతం గ్రాంటుగా కేంద్రం అందిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని జర్మనీకి చెందిన అభివృద్ధి బ్యాంకు (కేఎఫ్‌డబ్ల్యూ) నుంచి తక్కువ వడ్డీకి రుణం కింద సమకూర్చుకోవాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. 2029-30లో మొదటి దశను ప్రారంభించే అవకాశాలున్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి.

2032-33 నాటికి రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ల ద్వారా 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు సెప్టెంబరు 30న కేంద్ర క్యాబినెట్‌ రూ.1.86 ట్రిలియన్ల పెట్టుబడితోగ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ మూడో దశను ఆమోదించిన విషయం తెలసిందే. ఈ మొత్తం పెట్టుబడిలో రాష్ట్రాల మధ్య విద్యుత్‌ పంపిణీ ప్రాజెక్టులకు రూ.1.36 ట్రిలియన్లను ఆమోదించగా.. 50 గిగావాట్‌- గంటల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు రూ.50 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాల మధ్య విద్యుత్‌ పంపిణీ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం రూ.54,082 కోట్ల మేరకు ఆర్థిక మద్దతును ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.


ఈ ప్రాజెక్టును ఏడేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ ట్రాన్స్‌కో దీనిని అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు అధిక లబ్ధి చేకూరనుంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల విస్తరణ అధికంగా ఉన్నందున, ప్రధానంగా ఈ ప్రాంతాలను కేంద్రీకరించి సబ్‌ స్టేషన్లు, లైన్లు నిర్మించనున్నారు.

ప్రాజెక్టులో భాగంగా జరిగే నిర్మాణ పనులు

ఈ ప్రాజెక్టులో భాగంగా 7,872 సర్క్యూట్‌ కి.మీ. 400 కేవీ విద్యుత్‌ లైన్లు ఏర్పాటవుతాయి. 9,500 ఎంవీఏ సామర్థ్యంతో ఐదు కొత్త సబ్‌ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 13 వేల మెగావాట్ల విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యం లభిస్తుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ సామర్థ్యం సుమారు 18 వేల మెగావాట్లు కాగా, రాష్ట్ర డిమాండ్‌ అంచనాలకు అనుగుణంగా 2036 నాటికి 36 వేల మెగావాట్ల నెట్‌వర్క్‌ అవసరమని సీఈఏ (కేంద్ర విద్యుత్‌ సంస్థ) అంచనా వేసింది. దీన్ని అందుకునేందుకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-3 ఉపయోగపడుతుంది. 400 కేవీతోపాటు 220 కేవీ, 132 కేవీ సామర్థ్యం గల అత్యాధునిక గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ లేదా ఎయిర్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేస్తారు. వందల కిలోమీటర్ల మేర హై-వోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటు చేస్తారు.

ఎక్కడెక్కడంటే..?

సత్యసాయి జిల్లాలోని మదిగుబ్బ, తలుపులలో చెరో ఐదు గిగావాట్ల సామర్థ్యం మేరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. కడప జిల్లాలోని పోరుమామిళ్లలో ఒక గిగావాట్‌ మేరకు సామర్థ్యాన్ని నిర్మిస్తారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం, ఏలూరు జిల్లా కొప్పాకలో కూడా కొత్తగా 400 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. గత నెలలో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ మూడో దశ పథకానికి ఆమోదం లభించినప్పటికీ ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు అనుమతులు లభించలేదు. ప్రస్తుతం అన్ని అనుమతులూ లభించడంతో 2029-30 నాటికి ప్రాజెక్టు మొదటి దశ అమలయి తీరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని రోడ్డం-పెనుకొండ, గోరంట్ల, ఓడిచెరువు-అమడగూరు, కొండికొండ; ప్రకాశం జిల్లాలోని రాజుపాలెంలో పునరుత్పాదక ఇంధన జోన్లను గుర్తించారు.


ప్రధాన ప్రయోజనాలు

ఈ ప్రాజెక్టుతో గ్రీన్‌ ఎనర్జీ రవాణా సులభతరం కావడం వల్ల విద్యుత్‌ నష్టాలు తగ్గి, రాష్ట్ర డిస్కమ్‌లకు డబ్బు ఆదా అవుతుంది. రాష్ట్రంలో అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే గ్రిన్‌ పవర్‌ను ఇతర రాష్ర్టాలకు సులువుగా ఎగుమతి చేసే వీలు లభిస్తుంది. గ్రిడ్‌ భద్రత, లైన్ల కనెక్టివిటీ పక్కాగా ఉండటంతో పెద్ద ఎత్తున సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేట్‌ సంస్థలు రాష్ర్టానికి పెద్ద ఎత్తున రావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.

ఏమిటీ ప్రాజెక్టు?

దేశంలో పునరుత్పాదక విద్యుత్తు తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తోంది. తొలి దశ అయిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-1 లోనూ మన రాష్ట్రం భాగస్వామిగా ఉంది. మన రాష్ట్రంతోపాటు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో తొలి దశను అమలు చేశారు. రెండో దశ అయిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-2లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌, తమిళనాడు భాగస్వాములయ్యాయి. ఇక మూడో దశ అయిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ -3లో ఏపీ, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ భాగస్వాములుగా ఉన్నాయి. సంప్రదాయ విద్యుత్తును సరఫరా చేసే గ్రిడ్‌కు ఇబ్బంది కలగకుండా, దానిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా, పునరుత్పాదక ఇంధన విద్యుత్తును తరలించేందుకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 03:39 AM